అమరావతి పనులు పూర్తయ్యేందుకు నరేంద్రమోడీ కీలక నిర్ణయం
ఏపీ రాజధాని అమరావతికి విజయవాడ, గుంటూరు నగరాలతో అనుసంధానం పెరిగేలా కొత్త రైల్వే లైను నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. ఐదు సంవత్సరాలుగా పడకేసిన ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో శరవేగంగా నివేదికలు సిద్ధమవుతున్నాయి. రూ.2047 కోట్లతో 56 కిలోమీటర్ల మేర కొత్తగా నిర్మించే బ్రాడ్ గేజ్ మార్గం అందుబాటులోకి వస్తుంది. డీపీఆర్ కు రైల్వేబోర్డు ఆమోదం తెలిపిందని, ప్రాజెక్టుకు నీతి ఆయోగ్ ఆమోదముద్ర వేసిందని గుంటూరు డివిజన్ రైల్వే మేనేజర్ రామకృష్ణ తెలిపారు.
కృష్ణానదిపై మూడు కిలోమీటర్ల భారీ వంతెన
ఈ మార్గంలో కృష్ణానదిపై భారీగా వంతెన నిర్మాణం చేపట్టబోతున్నారు. కొత్తపేట-వడ్డమాను గ్రామాల మధ్య మూడు కిలోమీటర్ల మేర వంతెన ఉంటుంది. ఎర్రుపాలెం-అమరావతి-నంబూరు మధ్య 56.53 కిలోమీటర్ల మేర కొత్త మార్గం నిర్మిస్తారు. ముందుగా సింగిల్ లైన్ నిర్మిస్తారు. దీనికోసం గుంటూరు, పల్నాడు, కృష్ణ, ఖమ్మం జిల్లాల పరిధిలో భూసేకరణ చేయబోతున్నారు. భూసేకరణకు, నిర్మాణానికి కలిపి రూ.2600 కోట్లు ఖర్చవుతుందని రైల్వే శాఖ అంచనా వేసింది. అమరావతి నుంచి పెదకూరపాడు వరకు 25 కిలోమీటర్లు, సత్తెనపల్లి నుంచి నరసరావుపేట వరకు 25 కిలోమీటర్ల చొప్పున 106 కిలోమీటర్ల మేర కొత్త లైను నిర్మించేందుకు కేంద్రం నుంచి ఆమోదం లభించింది.

ఎర్రుపాలెం దగ్గర ప్రారంభమై నంబూరు వద్ద ముగుస్తుంది
హైదరాబాద్ నుంచి విజయవాడవైపు వచ్చే ప్రధాన రైల్వే లైనులో ఎర్రుపాలెం వద్ద ఈ మార్గం ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి అమరావతి మీదుగా విజయవాడ నుంచి గుంటూరు వెళ్లే మార్గంలో నంబూరు వద్ద కలుస్తుంది. ఎర్రుపాలెం తర్వాత పెద్దాపురం, చిన్నారావుపాలెం, గొట్టుముక్కల, పరిటాల, కొత్తపేట, వడ్డమాను, అమరావతి, తాడికొండ, కొప్పురావూరులలో రైల్వేస్టేషన్లు నిర్మిస్తారు. ఇందులో అమరావతి పెద్ద స్టేషన్ గా ఉంటుంది. ఇక్కడి నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు రైళ్లు నడవబోతున్నాయి. పరిటాల రైల్వేస్టేషన్ వద్ద గూడ్స్ రైళ్లు ఎక్కువగా నిలుస్తాయి. గుంటూరు రైల్వే డివిజన్ గతేడాది రూ.671 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.












Click it and Unblock the Notifications