అమరావతి రైతుల పాదయాత్రలో లాఠీ చార్జ్ జరగలేదు;అలజడికి కారణం టీడీపీ ర్యాలీ: ప్రకాశం ఎస్పీ మలికా గార్గ్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మాత్రమే కొనసాగించాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న రాజధాని ప్రాంత రైతులు న్యాయస్థానం టు దేవస్థానం అంటూ తుళ్లూరు నుండి తిరుపతి వరకు మహా పాదయాత్ర పేరుతో తమ ఉద్యమాన్ని జిల్లాలకు విస్తరించాలని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని, ఉద్యమ ఉధృతిని తెలియజేయాలని రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. అయితే మొదట అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి నిరాకరించిన పోలీసులు తీరుతో, కోర్టును ఆశ్రయించి, కోర్టు ఆదేశాలతో పాదయాత్ర నిర్వహించడానికి అనుమతులు తెచ్చుకున్నారు రాజధాని అమరావతి రైతులు. కఠినమైన ఆంక్షలు విధించి రాజధాని అమరావతి రైతుల మహా పాదయాత్రకు పోలీసులు అనుమతి ఇచ్చారు.

అమరావతి రైతుల పాదయాత్రలో లాఠీ చార్జ్ ... మొదలైన రాజకీయ దుమారం
ఆ తర్వాత గత 11 రోజులుగా అమరావతి రైతుల పాదయాత్ర తుళ్లూరు నుండి ప్రారంభమై, గుంటూరు జిల్లా ను దాటుకుని, ప్రకాశం జిల్లాకు చేరుకుంది. దారిపొడుగునా రాజధాని ప్రాంత రైతుల మహా పాదయాత్రకు ప్రజల నుండి విశేష మద్దతు లభించింది. ఇదే సమయంలో టిడిపి నేతలు కూడా పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించి పాదయాత్రలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఇప్పటికే అనేక సార్లు అమరావతి రైతులకు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని నోటీసులు జారీ చేశారు.

లాఠీ చార్జ్ పై స్పష్టత ఇచ్చిన ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్
నవంబర్ 11వ తేదీన పాదయాత్ర నిర్వహిస్తున్న రైతులపై ప్రకాశం జిల్లా చదలవాడ వద్ద పోలీసులు లాఠీఛార్జి చేసిన ఘటన రాజకీయ దుమారంగా మారగా, తెలుగుదేశం పార్టీ నేతలు ప్రభుత్వ తీరుపై, పోలీసులపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాంతియుతంగా పాదయాత్ర చేస్తున్న రైతులపై లాఠీ ఛార్జీలు చేయడం దారుణమని మండిపడుతున్నారు. ఈ క్రమంలో నవంబర్ 11వ తేదీ గురువారం నాడు జరిగిన లాఠీఛార్జ్ పై ప్రకాశం జిల్లా ఎస్పి మలికా గార్గ్ స్పష్టత ఇచ్చారు.

పాదయాత్ర సమయంలో ఎదురుగా టీడీపీ ప్రదర్శన .. అలజడి అందుకే
అమరావతి రైతుల పాదయాత్రకు ఎదురుగా మాజీమంత్రి టీడీపీ నాయకుడు ఆలపాటి రాజా నేతృత్వంలో సుమారు 300 మంది ర్యాలీగా వచ్చి ప్రదర్శనను నిర్వహించారని, ఈ ప్రదర్శనను అడ్డుకునే క్రమంలో అలజడి చెలరేగింది అని ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్ పేర్కొన్నారు. రైతుల పాదయాత్రకు సంఘీభావం ప్రకటించడానికి ఆలపాటి రాజా ఆధ్వర్యంలో 300 మంది పోలీసులు నిలువరించినా ఆగకుండా ముందుకు దూసుకు వచ్చారని పేర్కొన్నారు.

పోలీసులపై దురుసుగా ప్రవర్తించిన వ్యక్తులు, చెదరగొట్టిన పోలీసులు.. లాఠీ చార్జ్ గా ప్రచారం
పోలీసులపై ఆలపాటి రాజా ఆధ్వర్యం లోని వ్యక్తులు దురుసుగా ప్రవర్తించారని ఈ క్రమంలో పోలీసులు వారిని చెదరగొట్టారని ప్రకాశం జిల్లా ఎస్పీ తెలిపారు. అయితే లాఠీఛార్జి చేసినట్లుగా కొందరు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారని, పోలీసులపై కొందరు దురుసుగా వ్యవహరించడంతోనే, వారిని చెదరగొట్టారు తప్ప, ఎలాంటి లాఠీఛార్జ్ చేయలేదని ప్రకాశం జిల్లా ఎస్పీ స్పష్టత ఇచ్చారు. ఈ ఘటనపై తమ వద్ద ఉన్న వీడియో క్లిప్ లను సైతం ప్రదర్శించారు. ఈ ఘటనకు సంబంధించి మాజీ మంత్రి ఆలపాటి రాజా తదితరులపై కేసు నమోదు చేస్తామని ప్రకాశం జిల్లా ఎస్పీ వెల్లడించారు.

ఎన్నికల్ కోడ్ కారణంగా పాదయాత్రకు ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు
అంతేకాదు రైతుల పాదయాత్రను అడ్డుకోవడం తమ ఉద్దేశం కాదని పేర్కొన్నారు. రైతుల మహా పాదయాత్ర కు అడ్డంకులు తలెత్తకుండా నలువైపులా బారికేడ్లతో ఏర్పాటు చేశామని, జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నామని ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్ తెలిపారు. అమరావతి ప్రాంత రైతులు నిర్వహిస్తున్న పాదయాత్రలో 157 మంది రైతులు మినహా ఎవరూ పాల్గొనకూడదని ఇప్పటికే, నిబంధనలు పాటించాలని వారికి నోటీసులు ఇచ్చామని గుర్తుచేశారు.

పాదయాత్ర ఉల్లంఘనలపై ఇప్పటికే ఏడు కేసులు
పాదయాత్రలో ఉల్లంఘనలకు సంబంధించి ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో ఏడు కేసులు నమోదు చేశామని, వాటిని ఎప్పటికప్పుడు కోర్టు దృష్టికి తీసుకు వెళ్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో పాదయాత్రను కొనసాగించాలా నిలిపివేయాలా అన్నది ఎన్నికల కమిషన్ తీసుకోవాల్సిన నిర్ణయమని ప్రకాశం జిల్లా ఎస్పీ మలికా గార్గ్ స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications