టిడిపితో బిజెపి: తేలని లెక్క, జెపితో మల్కాజిగిరి ట్విస్ట్

ఈ పరిస్థితుల్లో రెండు శాఖలను కలిపి నిర్ణయం తీసుకునే పరిస్థితులు లేవు. ఏ శాఖ మేనిఫెస్టో ఆ శాఖ రూపొందించుకుంటుందని, ఏ శాఖ ఎజెండా ఆ శాఖకు ఉందని, ఈ దృష్ట్యా పొత్తులపై మాత్రం కలిసి మాట్లాడుకోవల్సిన అవసరం ఉండదని చెబుతున్నారు. టిడిపితో పొత్తుపై సీమాంధ్ర కమిటీ పొత్తు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకుంటుందని, అదే పద్ధతిని ఇటు తెలంగాణ కమిటీ అనుసరిస్తుందని అంటున్నారు.
పొత్తులపై రెండు శాఖలకు కలిపి ఒకే నిర్ణయం తీసుకునే పరిస్థితులు మాత్రం లేవని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే టిడిపితోపొత్తుపై ఇటు తెలంగాణతో పాటు, అటు సీమాంధ్ర కమిటీలు కొంత సానుకూలత వ్యక్తం చేసినా మరికొన్ని భిన్న స్వరాలు మాత్రం మిగిలే ఉన్నాయి. సీట్ల పంపకంపైనే ఇరు ప్రాంతాల కమిటీలు ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాయి.
సీమాంధ్రలో ఏడు ఎంపీ, 30 ఎమ్మెల్యే స్థానాలు అడుగుతుండగా, తెలంగాణ కమిటీ మాత్రం కచ్చితంగా 50 కంటే ఎక్కువ శాతం సీట్లు కావాలంటూ డిమాండ్ చేస్తుంది. తెలంగాణ శాఖతో పోల్చితే టిడిపితో పొత్తుపై సీమాంధ్ర కమిటీ ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్టు కనిపిస్తున్నది. అయితే రెండు ప్రాంతాల్లో కలిపి 17 ఎంపీ, 119 ఎమ్మెల్యే స్థానాల్లో సగానికంటే ఎక్కువ సీట్లు ఇస్తేనే టిడిపితో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమంటూ ఇప్పటికే పార్టీ జాతీయ నేత ప్రకాశ్ జవదేకర్‌కు తెలంగాణ కమిటీ స్పష్టం చేసింది.
లేకపోతే పార్టీకి పెద్దగా ఒరిగేదేమీ ఉండదని, ఒంటరిగానే పోటీకి వెళితే బాగుంటుందని కూడా సూచించింది. అయితే టిడిపితోపొత్తుపై రెండు, మూడు రోజుల్లో స్పష్టత రానుంది. ప్రకాశ్ జవదేకర్ ఢిల్లీకి వెళ్లి పొత్తులపై రాష్ట్ర ఇన్‌చార్జిగా ఉన్న అరుణ్ జైట్లీతో పాటు పార్లమెంటరీ బోర్డుకు నివేదిస్తారు. ఆ తర్వాత పార్టీ ఏదో ఒక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. ఇక బిజెపితో పొత్తు పెట్టుకుంటామని ప్రకటించిన లోకసత్తా ఇప్పటి వరకు బిజెపి తెలంగాణ కమిటీకి ఎలాంటి ప్రతిపాదన పంపలేదు.
అయితే బిజెపితో పొత్తు పెట్టుకుని, మల్కాజిగిరి స్థానం నుంచి లోక్‌సత్తా నేత జయప్రకాశ్ నారాయణ పోటీ చేస్తారంటూ వస్తున్న వార్తలతో ఆశావహుల్లో కలవరం ప్రారంభమైంది. దీనిపై శనివారం ఆశావహులు, పార్టీ నేతల్లో చర్చ సాగింది. లోకసత్తాతో పొత్తు కుదిరినా ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకున్న సీనియర్ నేతలను కాదని లోకసత్తాకు ఆ సీటు ఎలా కేటాయిస్తారన్న వాదనలు వినిపించాయి.
బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు రామచంద్ర రావు, పేరాల చంద్రశేఖర్ రావు టికెట్ ఆశిస్తున్నారు. తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి లోక్‌సభకు పోటీ చేయాల్సి వస్తే సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తారన్న వార్తలు వెలువడుతున్నాయి.
అయితే సికింద్రాబాద్ సీటును తాను వదులుకునే ప్రసక్తే లేదని పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు బండారు దత్తాత్రేయ భీష్మిస్తే... కిషన్ రెడ్డి మల్కాజిగిరి ఎంపీ సీటుకు మారవచ్చన్న ఊహాగానాలున్నాయి. జెపి మల్కాజిగిరి నుండి పోటీ చేస్తారనే అంశంపై టిడిపి నేత రేవంత్ రెడ్డి మండిపడ్డ విషయం తెలిసిందే. మల్కాజిగిరి సీటుపై బిజెపి, టిడిపి లోక్ సత్తా, జనసేన పార్టీలలో ఉత్కంఠ కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications