అమరావతి భూములపై సీబీఐతో విచారణ చేసినా అభ్యంతరం లేదు .. సుప్రీం కోర్టులో ఏపీ ప్రభుత్వ వాదన
అమరావతి భూ కుంభకోణంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారిస్తోంది. ఏపీ రాజధాని అమరావతి భూముల విషయంలో ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై జస్టిస్ అశోక్ భూషణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే . నేడు ఈ పిటిషన్ పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది రాజీవ్ ధావన్ వాదనలు వినిపించారు .
అమరావతి భూములకు సంబంధించి సిఐడి, సిట్ దర్యాప్తు పై హైకోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలని ప్రభుత్వం వేసిన పిటిషన్ పై జరిగిన విచారణలో భాగంగా భూముల కొనుగోలుపై సిబిఐతో దర్యాప్తు చేయించినా అభ్యంతరం లేదని పేర్కొన్నారు. సిట్టింగ్ జడ్జి లేదా రిటైర్డ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ చేయించినా సిద్ధమేనని ప్రభుత్వం తరపు న్యాయవాది వెల్లడించారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై మాత్రమే తాము సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు గా పేర్కొన్న న్యాయవాది రాజీవ్ ధావన్ భూముల కొనుగోలు పై విచారణ జరపాలని కోర్టు దృష్టికి తీసుకు వెళ్లారు.

అమరావతి భూముల వ్యవహారంపై ప్రస్తుత స్థాయిలో సుప్రీంకోర్టు విచారణ చేయాల్సిన అవసరం కూడా లేదని అభిప్రాయపడ్డారు. హైకోర్టులోనే పూర్తి స్థాయి విచారణ జరిపితే సరిపోతుందని పేర్కొన్నారు. ఇదే సమయంలో హై కోర్టులో కౌంటర్ వేయడానికి కూడా అవకాశం ఇవ్వకుండా మధ్యంతర ఆదేశాలు జారీ చేయడంతోనే సుప్రీం కోర్టులో పిటిషన్ వేశామని తెలిపారు.
అంతేకాదు విచారణ పూర్తయ్యే వరకు తాము ఎలాంటి చర్యలు చేపట్టబోమని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపు వాదనలు విన్న సుప్రీం ధర్మాసనం పిటిషన్ పై విచారణ ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications