హైదరాబాద్‌లో కెసిఆర్ హోర్డింగ్స్ తొలగింపు, రాజకీయ నేతలకు నో ప్లేస్
హైదరాబాద్ : ఇక నుంచి రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో హోర్డింగ్స్ ఉండవని తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. స్వచ్ఛ హైదరాబాద్‌పై కెసిఆర్ శుక్రవారంనాడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆ విషయం చెప్పారు. హైదరాబాద్ నగరంలో రాజకీయ నేతలకు సంబంధించిన హోర్డింగ్స్ కనిపించవని చెప్పారు. ఈ సమస్య తమ దృష్టికి వచ్చిందని సీఎం తెలిపారు. రాజకీయ నేతల హోర్డింగ్స్ ఉండొద్దని ఉత్తర్వులు ఉన్నాయని గుర్తు చేశారు.
ఇక రేపటి నుంచి నా హోర్డింగ్స్ మొదట తొలగించాలని ఆయన జీహెచ్‌ఎంసీ అధికారులకు సూచించారు. తమ పార్టీ నేతలకు కూడా హోర్డింగ్స్, పోస్టర్లను అతికించరాదని చెబుతానని తెలిపారు. హైదరాబాద్‌లో రాజకీయ నేతలకు సంబంధించిన రాతలను, పోస్టర్లను తొలగించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఇతర పార్టీల నేతలతో 26న సమావేశమై వారితో కూడా హోర్డింగ్స్, పోస్టర్లపై చర్చిస్తామని తెలిపారు.

కొందరి పుణ్యాత్ముల వల్ల హైదరాబాద్‌లో అరాచక వ్యవస్థ రాజ్యమేలుతోందని కెసిఆర్ అన్నారు. అరాచక వ్యవస్థను అంతమొందిచడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. జీహెచ్‌ఎంసీ అనుమతి లేకుండానే హైదరాబాద్ నగరంలో ఆకాశ హర్శాలు వెలిశాయని, ఇష్టారాజ్యంగా భూకబ్జాలు చేశారని, నాలాలపై కూడా ఇండ్లు కట్టారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని బస్తీల్లో అసలు స్థలమే లేదని, హైదరాబాద్‌లో అవినీతిని అంతం చేస్తామని అన్నారు.
సికింద్రాబాద్ నియోజకవర్గంలోనే పార్శీగుట్టలో స్మశానం తప్ప కొంచెం కూడా ఖాళీ ప్రదేశం లేదని, 10 వేల మంది పేదలకు ఇండ్లు లేవని ఆయన చెప్పారు. పాఠశాలలు కట్టుకుందామంటే స్థలం లేదని, చెట్లు నాటుకుందామన్న స్థలం దొరకని పరిస్థితి హైదరాబాద్ బస్తీల్లో నెలకొందని అన్నారు. బస్తీల్లో సమస్యల పరిష్కారానికి కమిటీలు ఏర్పాటు చేస్తామని, హైదరాబాద్‌లో రోడ్లపై చెత్త కన్పించకుండా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. హైజెనిక్ కూరగాయాలు, మాంసం మార్కెట్లు ఏర్పాటు చేస్తామని ఉద్ఘాటించారు.












Click it and Unblock the Notifications