టిట్ ఫర్ టాట్: ప్రత్యేకహోదా ఇవ్వబోమన్న మోడీకి చంద్రబాబు ఝలక్
హైదరాబాద్: రాజ్యసభ సీటు విషయంలో బీజేపీకి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఝలక్ ఇవ్వనున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో బీజేపీకి రాజ్యసభ సీటు ఇవ్వకూడదని నిర్ణయించుకున్నారని తెలుస్తోంది.
గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి వచ్చిన వెంటనే బీజేపీకి చెందిన కేంద్ర మంత్రి నిర్మాలా సీతారామన్‌కు రాజ్యసభ సీటు కేటాయించిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేత నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి మరణంతో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి నిర్మాలా సీతారామన్‌ను ఎంపిక చేశారు.
దీంతో నిర్మాలా సీతారామన్‌తో పాటు 56 మంది రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ఈ నెలాఖరుకు ముగియనుంది. కేంద్రం రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో నిర్మాలా సీతారామన్ సీటు వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వబోమని తేల్చిన నేపథ్యంలో రాష్ట్రంలో బీజేపీ-టీడీపీల మధ్య అంత సఖ్యత వాతావరణం కనిపించడం లేదు.

దీంతో రాష్ట్రంలో మారిన సమీకరణాల దృష్ట్యా నిర్మలా సీతారామన్‌కు సీటు ఇవ్వాలన్న ప్రతిపాదనేమీ లేదని చంద్రబాబు స్పష్టం చేశారు. ప్రధాని మోడీ భేటీ తర్వాత ఢిల్లీలో చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాజ్యసభ సీటుపై బీజేపీ నుంచి ఎటువంటి ప్రతిపాదన లేదని తేల్చి చెప్పారు.
ప్రధాని మోడీతో జరిగిన భేటీలో కూడా రాజ్యసభ సీటు ప్రస్తావన రాలేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే నిర్మలా సీతారామన్ ఏపీ భవన్‌లో చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ భేటీ తర్వాతే చంద్రబాబు మీడియాసమావేశంలో బీజేపీకి రాజ్యసభ సీటు ఇవ్వాలన్న ప్రతిపాదనేదీ లేదని తేల్చి చెప్పారు.
అంతేకాదు నిర్మలా సీతారామన్‌కు కూడా ఇదే విషయాన్ని చంద్రబాబు స్పష్టం చేసి ఉంటారని రాజకీయపరిశీలకులు భావిస్తున్నారు. కాగా, నిర్మలా సీతారామన్‌ను మంత్రి పదవి నుంచి తొలగించి మళ్లీ పార్టీ సేవలకే పరిమితం చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా భావిస్తున్నట్లు తెలిసింది.
బీజేపీకి చెందిన 14 మంది రాజ్యసభ సభ్యులు ఈ నెలాఖరున పదవీ విరమణ పొందుతున్నారు. ఇందులో ఏడుగురు కేంద్ర మంత్రులున్నారు. వీరందరినీ ఏఏ రాష్ర్టాల నుంచి మళ్లీ రాజ్యసభకు తీసుకోవాలన్న దానిపై ప్రధాని మోడీ, పార్టీ అధ్యక్షుడు అమిత్ షా కసరత్తు ప్రారంభించారని తెలుస్తోంది.
ఈనెల 19న బీజేపీ పార్లమెంటరీబోర్డు సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలోనే రాజ్యసభ స్థానాలపై ఒక స్పష్టత రానున్నారు. వెంకయ్య కూడా కర్ణాటక నుంచి రాజ్యసభకు వచ్చేదీ లేనిది కూడా ఈ సమావేశంలోనే తేలనుంది. కాగా, ఆరెస్సెస్ నుంచి బీజేపీ ప్రధాన కార్యదర్శిగా నియమితులైన రాంమాధవ్‌ను నిర్మలా సీతారామన్ స్థానంలో కేబినెట్‌లోకి తీసుకు రావాలని మోడీ భావిస్తున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications