దగ్గుబాటి సురేశ్ కు షాక్-రామానాయుడు స్డూడియోస్ పై తేల్చేసిన సుప్రీం కోర్టు..!
ప్రముఖ సినీ నిర్మాత, సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేశ్ కు ఇవాళ సుప్రీంకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విశాఖలో రామనాయుడు స్టూడియోస్ ఏర్పాటు కోసం ప్రభుత్వం నుంచి భూములు తీసుకుని వాటిలో కొంత భాగం ఇతర అవసరాలకు వాడుకున్న వ్యవహారంలో ఏపీ ప్రభుత్వంతో సాగుతున్న పోరులో సురేశ్ ప్రొడక్షన్స్ కు షాక్ తప్పలేదు. ఈ విషయంలో ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది.
విశాఖలోని రామానాయుడు స్డూడియోస్ కు గతంలో కేటాయించిన భూముల్లో 14 ఎకరాల మేర ఇతర అవసరాలకు వాడుకునేందుకు గత వైసీపీ సర్కార్ అనుమతి ఇచ్చింది. అయితే దీన్ని గతేడాది అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలని నోటీసులు ఇచ్చింది. దీనిపై విచారణ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సురేశ్ ప్రొడక్షన్స్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఏపీ ప్రభుత్వం సురేశ్ ప్రొడక్షన్స్ కు విశాఖ రామానాయుడు స్డూడియోస్ భూముల వాడకం విషయంలో జారీ చేసిన నోటీసుల్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ ను సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. సుప్రీంకోర్టులోని జస్టిస్ అభయ్ ఓకా ధర్మాసనం ఈ కేసులో మధ్యంతర ఆదేశాలు ఇచ్చేందుకు నిరాకరించింది. దీనిపై సంబంధిత కోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. దీంతో సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకునేందుకు సురేశ్ ప్రొడక్షన్స్ అనుమతి కోరింది. సుప్రీంకోర్టు అనుమతి ఇవ్వడంతో ఈ పిటిషన్ ను సురేశ్ ప్రొడక్షన్స్ వెనక్కి తీసుకుంది.
రామనాయుడు స్డూడియోస్ కు గతంలో కేటాయించిన భూముల్లో ఇతర అవసరాలకు వాడుతున్న భూముల్ని రద్దు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఈ మేరకు వివరణ ఇవ్వాలని సురేశ్ ప్రొడక్షన్స్ కు నోటీసులు కూడా ఇచ్చింది.. ఇప్పుడు దీనిపై సుప్రీంకోర్టు కూడా జోక్యానికి నిరాకరించిన నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏం చేయబోతోందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.












Click it and Unblock the Notifications