హైదరాబాద్‌లో బిజెపి సభ: కనిపించని వెంకయ్య కటౌట్స్
హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మంగళవారం నాటి భారతీయ జనతా పార్టీ సభలో ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు కటౌట్లు, ఫోటోలు ఎక్కడా కనిపించలేదు. నిజాం కళాశాల మైదానంలో మంగళవారం బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ అభినందన సభను నిర్వహిస్తున్నారు.
ఈ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్, అగ్రనేత అరుణ్ జైట్లీ తదితరులు వచ్చారు. ఈ సభ ఏర్పాట్లను బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి, సీనియర్ నేతలు బండారు దత్తాత్రేయ తదితరులు పర్యవేక్షించారు.

అయితే, ఇది పూర్తి తెలంగాణ సభ కావడంతో వెంకయ్య నాయుడు ఫోటోలను ఏర్పాటు చేయలేదని తెలుస్తోంది. అలాగే ఈ సభలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన వెంకయ్య నాయుడు పాల్గొనడం లేదు. రాష్ట్రంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభల్లో వెంకయ్య నాయుడు కటౌట్స్ ఏర్పాటు చేయక పోవడం ఇదే మొదటిసారి అని చెప్పవచ్చు.
సుస్థిర పాలన మాతో సాధ్యం: జైట్లీ
గత ఎన్నికలకు 2014 ఎన్నికలకు తేడా ఉందని బిజెపి సీనియర్ నేత అరుణ్ జైట్లీ తెలిపారు. ఈ ఎన్నికలు ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరగబోతున్నాయని అన్నారు. దేశానికి ఎవరు సరైన పాలన అందిస్తారనేదే ఈ ఎన్నికల్లో కీలకమని చెప్పారు. సుస్థిర పాలన అందించే పార్టీనే ప్రజలు ఎన్నుకోవాలని సూచించారు. ఎన్డీఏ హయాంలో 8.5 శాతం వృద్ధి రేటు ఉంటే... యూపీఏ హయంలో అది 4.5 శాతానికి దిగజారిందని తెలిపారు. పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో ప్రసంగిస్తూ జైట్లీ పై వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications