హోదాపై ట్విస్ట్, ఊహించిందే..: కేవీపీకి కేంద్రం షాక్, చంద్రబాబు సేఫ్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఏపీ రాజకీయ పార్టీలు ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రత్యేక హోదా ప్రయివేటు బిల్లు పైన రాజ్యసభలో శుక్రవారం నాడు చర్చ లేనట్లే కనిపిస్తోంది. ప్రత్యేక హోదా విషయమై ప్రయివేటు బిల్లు విషయంలో ఎన్డీయే ప్రభుత్వం ఏదైనా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లవచ్చనే చర్చ జరిగింది.
ఓటింగ్ జరుగుతుందని చాలామంది నమ్మలేదు. కాంగ్రెస్ పార్టీ పార్టీ ఎంపీలు జైరామ్ రమేష్, కేవీపీ రామచంద్ర రావులు కూడా గురువారం నాడు ఇదే అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ తప్పించుకునే ప్రయత్నాలు చేస్తోందన్నారు.
బీజేపీ తప్పించునే ప్రయత్నాలు చేసిందా లేదా అనే విషయం పక్కన పెడితే... ఈ రోజు పదవి కాలం ముగిసిన 53 మంది రాజ్యసభ ఎంపీలకు వీడ్కోలు పలికారు. పదవీకాలం ముగిసిన ఎంపీలకు వీడ్కోలు నేపథ్యంలో ఇతర అంశాలపై చర్చించేది లేదని రాజ్యసభ చైర్మన్ ప్రకటించారు.

కాంగ్రెస్ పార్టీ సభ్యుడు కేవీపీ రామచంద్ర రావు ప్రత్యేక హోదా పైన ప్రయివేటు బిల్లు ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. దానిపై గత వారం చర్చ జరిగింది. ఈ రోజు బిల్లు పైన ఓటింగ్ ఉంటుందని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తమ సభ్యులకు విప్ జారీ చేసింది. విపక్షాలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికాయి.
ఈ నేపథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం వ్యూహాత్మకంగా గురువారమే రాజ్యసభను నిరవధిక వాయిదా వేస్తుందనే చర్చ జరిగింది. కానీ గురువారం వాయిదా వేయలేదు. దీంతో ఈ రోజ ప్రత్యేక హోదా బిల్లుపై ఓటింగ్ జరుగుతుందని కొందరు ఆశించారు.
కానీ, గురువారం రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయినందున.. టర్మ్ పూర్తయిన ఎంపీలకు వీడ్కోలు పలుకుతున్నారు. దీంతో ప్రత్యేక హోదా ప్రయివేటు బిల్లు పైన ఈ రోజు చర్చ జరిగే అవకాశం లేకుండా పోయింది. అంతేకాదు, అనంతరం రాజ్యసభ నిరవధిక వాయిదా పడనుంది. కాగా, రాజ్యసభలో ఓటింగ్ పెడితే టిడిపి చిక్కుల్లో పడేది. నిరవధిక వాయిదా ద్వారా చంద్రబాబును ప్రధాని మోడీ గట్టెక్కిస్తున్నారని చెప్పవచ్చు.












Click it and Unblock the Notifications