టీ తీర్మానంపై అసెంబ్లీలో ఓటింగు ఉండదు: మంత్రి ఆనం
హైదరాబాద్: తెలంగాణ తీర్మానంపై శాసనసభలో ఓటింగ్ జరగదని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. అభిప్రాయ సేకరణకు మాత్రమే విభజన తీర్మానాన్ని శానససభకు పంపిస్తారని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు. సభ్యుల అభిప్రాయాలను నివేదిక రూపంలో స్పీకర్ నివేదిస్తారని చెప్పారు. మెజారిటీ సభ్యుల అభిప్రాయానికి అనుగుణంగా కేంద్రం నిర్ణయం ఉంటుందని అనుకుంటున్నట్లు ఆయన తెలిపారు.
ఉద్యోగుల సమ్మె విషయంలో గతంలో పాటించిన విధానాలనే ఇప్పటి సమ్మె విషయంలోనూ పాటిస్తామని ఆయన అన్నారు. పార్టీపరంగా సీమాంధ్రలో విభజన వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని తాము చెప్పామని, అయినా కేంద్రం ముందుకు సాగుతోందని, అయితే తదుపరి విభజన ప్రయత్నాలను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అడ్డుకుంటారని ఆశిస్తున్నామని ఆయన అన్నారు.

తమ ప్రాంత ప్రజల మనోభావాలను బట్టి తమకు విభజన సమ్మతం కాదని తాము చెప్తామని, ఇన్నేళ్ల పోరాటం తర్వాత తమకు ఫలితాలు అందే సమయం వచ్చిందంటూ దాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారని తెలంగాణ ప్రాంత నాయకులు అంటున్నారని, అలా చెప్పడంలో తప్పు లేదని ఆయన అన్నారు. తమ ప్రాంత మనోభావాలను సీమాంధ్ర శాసనసభ్యుల ఫోరం వినిపిస్తుందని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని మంత్రి గంటా శ్రీనివాస రావు, శాసనసభ్యుడు రమణమూర్తి రాజు విశాఖపట్నం జిల్లాలో ప్రతిజ్ఞ చేశారు. అసెంబ్లీలో తెలంగాణ తీర్మానాన్ని ఓడిస్తే విభజన ప్రక్రియ ఆగిపోతుందని గంటా శ్రీనివాస రావు అన్నారు.
కాగా, తెలంగాణపై కేంద్ర కమిటీకి నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రాంత కాంగ్రెసు ఎమ్మెల్సీలు నిర్ణయించారు. వారు గురువారం సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఆరు వారాల్లోగా మంత్రుల బృందం నివేదిక ఇవ్వకపోతే తెలంగాణ ప్రజలకు అనుమానాలు వస్తాయని వారన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డే సీమాంధ్ర ఉద్యమ నాయకుడిగా వ్యవహరిస్తున్నారని వారు విమర్శించారు.












Click it and Unblock the Notifications