లాడ్జిలో ఎన్నారై అనుమానాస్పద మృతి: పెళ్లైన రెణ్నెళ్లకే దంపతుల ఆత్మహత్య
విజయవాడ : శ్రీరామ్ అనే ప్రవాస భారతీయుడు (ఎన్నారై) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడలో గల ఒక లాడ్జిలో ఈనెల 10వ తేదీన అనుమానాస్పదంగా మరణించారు. అయితే, తన భర్త ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని, ఆస్తి కోసం అత్తింటి వారే ఆయన్ను చంపేశారని శ్రీరామ్ భార్య అనిల ఆరోపిస్తున్నారు. వందల కోట్లు ఆస్తులు తమకున్నాయని, అత్తింటి వారు శ్రీరామ్‌తో గతంలోనే డాక్యుమెంట్లపై సంతకాలు తీసుకున్నారని అనిల ఆరోపించారు. తన భర్త అనుమానాస్పద మరణంపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు.

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
కాగా, నెల్లూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అల్లూరు సమీపంలో విద్యుత్ స్తంభాన్ని స్కూటీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. ఐదేళ్ళ చిన్నారి ప్రమాదస్థలం వద్దే మృతి చెందగా, తీవ్ర గాయాల పాలైన నందిని తల్లి, అమ్మమ్మ, సోదరుడును నెల్లూరులోని ఒక ప్రవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నందిని తల్లి, అమ్మమ్మ మృతిచెందారు. చికిత్స పొందుతున్న నందిని సోదరుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.
డ్రైవర్‌ను చెప్పుతో కొట్టిన ప్రయాణికుడి మృతి
నెల్లూరు జిల్లా కోట మండల కేంద్రంలో జనార్ధన్ అనే వ్యక్తి ఆర్టీసీ బస్సులో ప్రయాణించాడు. మార్గమధ్యంలో తోటి ప్రయాణికులతో గొడవ పెట్టుకోవడమే కాకుండా డ్రైవర్‌ను చెప్పుతో కొట్టాడు. డ్రైవర్‌పై దాడి చేసి చెప్పుతో కొట్టిన జనార్ధన్‌ను కండక్టర్ పోలీసులకు అప్పజెప్పారు. పోలీసులు అతడి కి ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు ఆస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో అతను మృతిచెందాడు.
నవదంపతుల ఆత్మహత్య
కడప జిల్లా కేంద్రంలోని మట్టిపెద్దపులి వీధిలో విషాద సంఘటన చోటుచేసుకుంది. వివాహం జరిగి రెండునెలలు కూడా గడవని నవ దంపతులు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుటుంబ కలహాల కారణంగానే ఇరువురు ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. వీరి ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications