ఏపీ ఎన్నికలపై సుప్రీంకోర్టుకు ఒడిశా సర్కార్..! రీజన్ ఇదే..!
ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే హింస కారణంగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా దాడులు, దౌర్జన్యాలు, రోడ్ల మీద, నామినేషన్ కేంద్రాల లోపలికి దూరి నామినేషన్ పత్రాలు లాక్కెళ్లిపోతుండటం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. అయినా ఏపీ ఎస్ఈసీ, పోలీసులు చర్యలు తీసుకోకపోవడం, ఈ వ్యవహారం సుప్రీంకోర్టు వరకూ వెళ్లడంతో ఏపీ స్థానిక ఎన్నికలు ఇప్పటికే చర్చనీయాంశంగా మారాయి. ఇలాంటి సమయంలో ఒడిశా ప్రభుత్వం (Odisha Govt) ఏపీ స్థానిక ఎన్నికలపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఏపీలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా ఒడిశా సరిహద్దుల్లో దశాబ్దాలుగా వివాదాస్పదంగా ఉన్న కోరాపుట్ జిల్లాలోని 28 కొటియా గ్రామాల్లోనూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేసింది. దీంతో కొటియా గ్రామ పంచాయతీ పరిధిలోకి వచ్చే ఈ 28 వివాదాస్పద గ్రామాల్లో ఏపీ పరిధిలోకి వచ్చే 21 గ్రామాల్లో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారంటూ ఇప్పటికే ఒడిశాలో పార్టీలతతీకంగా ప్రజాప్రతినిధులు ఏకమై అక్కడ రచ్చ రచ్చ చేస్తున్నారు. దీంతో ఒడిశాలోని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఎప్పుడో 1968లోనే ఈ కొటియా గ్రామాల వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. పలు విచారణల తర్వాత 2006లో కొటియా గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించకుండా, ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఇరు రాష్ట్రాలకూ సుప్రీంకోర్టు స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు దీన్ని ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు నిర్వహిస్తోందంటూ ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు కోరాపుట్ జిల్లా కలెక్టర్ ఒడిశా ప్రభుత్వం తరఫున ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ప్రభుత్వం, ఎస్ఈసీ మాత్రం ఈ గ్రామాలు పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోకి వస్తాయని వాదిస్తున్నాయి. వాస్తవానికి 2021లోనూ వైసీపీ హయాంలో ఇలాగే ఈ గ్రామాల్లో ఎన్నికల నిర్వహణకు అప్పటి ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ ప్రయత్నించారు. అప్పట్లోనూ ఒడిశా ప్రభుత్వం సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేసి వాటిని అడ్డుకుంది. ఇప్పుడు మరోసారి అదే తరహా పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సుప్రీంకోర్టు విచారణ జరపబోతోంది.














Click it and Unblock the Notifications
