జగన్ సర్కార్: ఏపీ ఆసుపత్రుల ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ..పర్యవేక్షణ ఇక విశాఖ నౌకాదళం చేతికి
అమరావతి: రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఎవరూ ఊహించలేని చర్యకు దిగారు. టెంపుల్ టౌన్ తిరుపతిలోని ప్రఖ్యాత రామ్‌నారాయణ్ రూయా ఆసుపత్రిలో చోటు చేసుకున్న పెను విషాదకర ఘటన అనంతరం.. ఆయన యుద్ధ ప్రాతిపదికన దిద్దుబాటు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అత్యున్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల నష్ట పరిహారాన్ని ప్రకటించారు.

ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ నౌకాదళానికి..
తిరుపతి రూయా ఆసుపత్రిలో చోటు చేసుకున్న ఘటనపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఈ సమావేశం కొద్దిసేపటి కిందటే ముగిసింది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారాయన. రాష్ట్రంలోని అన్ని ఆసుపత్రుల్లో ఉండే ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణ బాధ్యతను తూర్పు నౌకాదళం అధికారుల చేతికి అప్పగించారు. విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా పనిచేస్తోన్న ఈస్టర్న్ నావల్ కమాండ్ అధికారులు ఇక మీదట ఆసుపత్రుల్లో ఉండే ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణను చూసుకుంటారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేంత వరకూ వాటి పర్యవేక్షణ నౌకాదళాధికారుల చేతిలోనే ఉంటుంది.

రూయాకు చేరుకున్న నౌకాదళాధికారులు..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ మేరకు వైజాగ్ ఈస్టర్న్ నావల్ కమాండ్ అధికారులకు విజ్ఞప్తి చేసిన కొద్దిసేపటికే.. అక్కడి నుంచి ప్రత్యేక అధికారుల బృందం తిరుపతికి బయలుదేరింది. రూయా ఆసుపత్రిని సందర్శించింది. ఈ బృందంలో ఆరుమంది అధికారులు ఉన్నారు. రూయా ఆసుపత్రి సూపరింటెండెంట్, రెసిడెంట్ డాక్టర్‌ను కలిశారు. సోమవారం రాత్రి చోటుచేసుకున్న ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. దీనితోపాటు- రూయా ఆసుపత్రిలో ప్రాంగణంలోనే మరో ఆక్సిజన్ ప్లాంట్‌ను నిర్మించబోతున్నట్లు తెలిపారు. అనంతరం వారు ఆక్సిజన్ ప్లాంట్‌లో కలియతిరిగారు. సాంకేతిక లోపాలు ఎక్కడ చోటు చేసుకున్నాయనేది తెలుసుకున్నారు.
Recommended Video
10 లక్షల పరిహారం..
రూయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందక మరణించిన 11 మంది కరోనా వైరస్ పేషెంట్ల కుటుంబాలకు జగన్ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆ కుటుంబాలకు నష్ట పరిహారాన్ని ప్రకటించారు. 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. చేయని తప్పునకు విమర్శలు, ఆరోపణలను ఎదుర్కోవాల్సి వస్తోందని జగన్ ఈ సందర్భంగా ఈ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు. కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఒత్తిడి ఆసుపత్రులపై తీవ్రమైందని, అందుకే- ఆక్సిజన్ ప్లాంట్ల నిర్వహణపై ఉద్యోగులు, సిబ్బంది దృష్టి సారించట్లేదనే నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. అందుకే- వాటి నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలను నౌకాదళాధికారులకు అప్పగించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications