amaravati vijayawada visakhapatnam CM ys jaganmohan reddy ap government covid 19 Coronavirus andhra pradesh
ఏపిలో కొనసాగుతున్న రాజధాని రగడ..! రాజధాని తరలింపుపై దాఖలైన మరో పిటిషన్..!!
అమరావతి/హైదరాబాద్ : ప్రపంచమంతా కరోనా కట్టడిలో తలమునకలై ఉంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం రాజకీయం రంజుగా కొనసాగుతోంది. ఓపక్క అధికార వైసీపి ఎంపీ విజయసాయి రెడ్డి, బీజేపి ఏపి అధ్యక్షుడు కన్న లక్ష్మీనారాయణ మధ్య మాటల తూటాలు పేలుతుంటే, మరోపక్క రాజధాని తరలింపు ప్రయత్నాలను ప్రభుత్వం ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. దీంతో తాజాగా రాజధాని తరలింపును వ్యతిరేకిస్తూ ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ గద్దె తిరుపతి రావు ఈ తాజా పిటిషన్‌ను ఏపీ ఉన్నత న్యాయస్థానంలో దాఖలు చేశారు.
టీడీపీ నేతల మెడకు ఉచ్చు: అమరావతి భూ ఆక్రమణలపై సీబీఐ విచారణ: అసలు టార్గెట్ వారే..!

విశాఖలో పనిచేసేందుకు సిద్దంగా ఉండండి.. ఉద్యోగులకు ఏపి ప్రభుత్వం ఆదేశాలు..
దేశం మొత్తం లాక్ డౌన్ లో ఉంటూ ఎక్కడికక్కడ షట్ డౌన్ పాటిస్తుంటే ఆంధ్ర ప్రదేశ్ మాత్రం రాజకీయంతో రగిలిపోతోంది. ఆరోపణలు-ప్రత్యారోపణలు, విమర్శలు-ప్రతివిమర్శలతో రాజకీయం తారా స్థాయిలో నడుస్తోంది. అంతే కాకుండా దేవుళ్లను కూడా తమ రాజకీయాలకు ఎంపైర్లుగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు ఏపి నేతలు. ఇదిలా ఉండగా రాజధాని తరలింపు అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. సచివాలయం ఉద్యోగులందరూ విశాఖపట్టణంలో పనిచేసేందుకు సిద్దంగా ఉండాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుండి వచ్చిన ఆదేశాలే ఈ రగడకు కారణంగా తెలుస్తోంది. అంతే కాకుండా కరోనా క్లిష్ట సమయంలో రాజదాని తరలింపు నిలువరించాలంటూ న్యాయస్థానంలో పిటీషన్ కూడా ధాఖలయ్యింది.

మరోసారి వెలుగులోకి వచ్చిన రాజధాని అంశం.. ఇప్పుడెందుకంటున్న ఏపి ప్రజలు..
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని రగడ దాదాపు నాలుగు నెలలుగా కొనసాగుతూనే వుంది. ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే విపక్షాలన్నీ అమరావతినే రాజధానిగా కొనసాగించాలని పట్టుబడుతున్నాయి. ఈ క్రమంలోనే కరోనా వైరస్ వ్యాప్తి మొదలు కావడంతో రాజధాని వివాదం కొంత కాలం మరుగున పడుతుందని అందరూ భావించారు. కాని ఏపి ప్రభుత్వం మాత్రం రాజదాని తరలింపు విషయంలో చాలా స్పష్టతతో ఉన్నట్టు తెలుస్తోంది. సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రాజధాని తరలింపు అంశాన్ని అమరావతి పరిరక్షణ సమితి నాయకులు వ్యతిరేకిస్తున్నారు.

రాజధాని తరలించొద్దంటూ కోర్టులో పిటీషన్.. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్..
తాజాగా అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ గద్దె తిరుపతిరావు రాజధాని తరలింపుపై హైకోర్టులో అత్యవసర పిటిషన్‌ను దాఖలు చేశారు. ప్రభుత్వం సెక్రటేరియట్‌ను గుట్టుచప్పుడు కాకుండా విశాఖకు తరలించేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. విశాఖకు వెళ్లేందుకు సిద్ధం కావాలని ఉద్యోగులకు సూచనలిస్తోందని పిటిషనర్ కోర్టుకు నివేదించారు. ఎగ్జిక్యూటివ్ రాజధాని తరలింపును నిలువరించాలని తిరుపతి రావు ఏపీ హైకోర్టును కోరారు.
దీంతో రాజధాని తరలింపు అంశం మరోసారి వెలుగులోకి వచ్చింది.

కరోనా క్లిష్ట సమయంలో రాజకీయాలేంటి.. అసహనం వ్యక్తం చేస్తున్న ఏపి ప్రజలు..
రాజధాని తరలింపు అంశం మరో సారి తెరమీదకు రావడం పట్ల ఏపి ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి రోజురోజుకూ విజృంభిస్తుంటే ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సింది పోయి రాజకీయాలు చేయడమేంటనే భావన వ్యక్తం అవుతోంది. కరోనా రోగులకు సరైన వసతులు కల్పించి ప్రాణ నష్టం కలుగకుండా చూడాల్సిన సమయంలో వివాదాస్పద రాజకీయాలు ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కరోనా వైరస్ నుండి పరిస్థితులు చక్కబడిన తర్వాత రాజకీయాలు చేయాలిగాని, ప్రాణాంతక మహమ్మారి ఇంటి గుమ్మంముందు పెట్టుకొని ఏదో ఆలోచించడం అంత శ్రేయస్కరం కాదనే అభిప్రాయలు ఏపి ప్రజలు వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.