
Oneindia Exclusive: రోజా మంత్రి పదవిపై తేల్చేసారు : మహిళా హోం మంత్రి ఖరారు..!!
వైసీపీ ఫైర్ బ్రాండ్..నగరి ఎమ్మెల్యే రోజాకు మంత్రి పదవి దక్కనుందా. ఇంతకాల నిరీక్షణ ఫలించబోతోందా. కొద్ది రోజులుగా సీఎం జగన్ మంత్రివర్గ విస్తరణలో రోజాకు పక్కాగా అవకాశం దక్కుతుందని ప్రచారం సాగుతోంది. 2024 ఎన్నికల కు అడుగులు వేస్తున్న సీఎం జగన్ .. ప్రస్తుతం కొత్త కేబినెట్ కూర్పు పైన ఆచితూచి అడుగులు వేస్తున్నారు.
సామాజిక - ప్రాంతీయ సమీకరణాలతో పాటుగా అనుభవం - జూనియర్లు కలగలిపి తన ఎలక్షన్ కేబినెట్ ఉండాలని భావిస్తున్నారు. అందులో భాగంగానే..ముందుగా నలుగురు లేదా అయిుదుగురు ప్రస్తుత మంత్రులు కొనసాగుతారని భావించినా..ప్రస్తుతం ఆ సంఖ్య 10 -11 మధ్య ఉందని విశ్వసనీయ సమాచారం.

ఎప్పటికప్పుడు మారుతున్న లెక్కలు
సీనియర్లకు పార్టీ బాధ్యతలు అప్పగించాలని భావించిన సీఎం..ఇప్పుడు మొత్తం జూనియర్లు అయితే ప్రభుత్వ పాలన ఎన్నికల సమయంలో కష్టంగా మారుతుందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో..కొత్తగా 14-17 మందికి మాత్రమే అవకాశం దక్కే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే, ఈ కేబినెట్ విస్తరణలో రోజా అంశం పైన అందరిలోనూ ఆసక్తి నెలకొంది.
2019 ఎన్నికల్లో రోజా రెండో సారి ఎమ్మెల్యేగా గెలిచారు. జగన్ సీఎం అయిన తరువాత తొలి కేబినెట్ లోనే మంత్రిగా అవకాశం వస్తుందని భావించారు. కానీ, జిల్లా సామాజిక సమీకరణాల్లో సాధ్యపడ లేదు. ఆ తరువాత ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ గా నామినేటెడ్ పదవి ఇచ్చారు. ఈ సారి విస్తరణలో సీనియర్లను తప్పిస్తున్నారనే ప్రచారం సాగటంతో..పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని తప్పించి..ఆ స్థానంలో రోజాకు అవకాశం దక్కుతుందనే అంచనాలు వ్యక్తం అయ్యాయి.

పెద్దిరెడ్డి ఎఫెక్ట్ - రోజాకు మంత్రి పదవి లేనట్లే..
కానీ, సీనియర్లు - అనుభవం ఉన్న వారిని కొనసాగించాలనే నిర్ణయానికి సీఎం రావటంతో పెద్దిరెడ్డి కొనసాగింపు ఖరారైంది. ఈ పరిస్థితుల్లో రోజాకు మంత్రి పదవి ఇవ్వలేకపోతున్నామంటూ రోజా కు సమాచారం పంపినట్లు విశ్వసనీయ సమాచారం. మంత్రి పెద్దిరెడ్డి కేబినెట్ లో కంటిన్యూ కానున్నారు. రోజాకు రాయలసీమ జిల్లాల బాధ్యతలను అప్పగించనున్నట్లు తెలుస్తోంది.
ఇక, కేబినెట్ లో ప్రస్తుతం ఉన్న ముగ్గురు మహిళా మంత్రుల్లో ఒకరు ఎస్టీ కాగా.. మరో ఇద్దరు ఎస్సీ మంత్రులు. సీనియర్లను కొందరిని కొనసాగించాలని సీఎం భావిస్తున్న సమయంలో... వీరిలో ఎవరు కొనసాగుతారనే చర్చ పైన ఒక క్లారిటీ వచ్చినట్లుగా తెలుస్తోంది. జగన్ సీఎం అయిన తరువాత ఎస్సీ మహిళకు హోం మంత్రి పదవి ఇచ్చిన అంశాన్ని పలుమార్లు చెప్పారు.
Recommended Video

హోం మంత్రిగా మరోసారి ఛాన్స్..
కేబినెట్ విస్తరణ తరువాత మహిళ కే హోం మంత్రి పదవి ఇవ్వాలని..అందునా ఎస్సీ మహిళకే ఇవ్వాలనేది సీఎం జగన్ ఆలోచనగా సమాచారం. ఇదే సమయంలో ఎస్సీ మహిళా - జిల్లా సమీకరణాల్లో భాగంగా.. ఆ ఈక్వేషన్ అమలు ఇతర మంత్రుల ఖరారుతో సాధ్యపడటం లేదని తెలుస్తోంది. దీంతో.. తాజాగా రాజీనామా చేసిన సుచరితను తిరిగి కేబినెట్ లో కొనసాగించాలని.. హోం మంత్రి పదవి సైతం కంటిన్యూ చేయాలని భావిస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.
ఈ కేబినెట్ లో ఎస్సీ - ఎస్టీ- బీసీ వర్గాలకు ప్రాధాన్యత పెరిగేలా కూర్పు ఉంటుందని చెబుతున్నారు. అందులోనూ మహిళా మంత్రుల సంఖ్య పెరుగుతుందని సమాచారం. దీంతో.. హోం మంత్రిగా ఎస్సీ మహిళనే కంటిన్యూ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఒక దశలో తానేటి వనిత పేరు పైనా చర్చ సాగినా..ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. దీంతో..చివరి నిమిషం లో అనూహ్య మార్పులు జరిగితే మినహా.. సుచరిత తిరిగి హోం మంత్రిగా కంటిన్యూ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.