జూన్ 8: చంద్రబాబు ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జూన్ 8న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఆ రోజున ఆయనొక్కరే ప్రమాణం చేస్తారా? లేక ఆయనతోపాటు మంత్రివర్గ సభ్యులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారా అనేదానిపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. జూన్ 8న చంద్రబాబు నాయుడు ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తే మేలని పార్టీ వర్గాలు భావిస్తున్నట్లు తెలిసింది.
ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నాలుగు రోజులకి (జూన్ 12న) మంత్రివర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించవచ్చనే అభిప్రాయాలు వెల్లడవుతున్నట్లు సమాచారం. జూన్ 8న చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ తోపాటు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, పంజాబ్ సిఎం ప్రకాష్ సింగ్ బాదల్, మరికొందరు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు హాజరవుతారని భావిస్తున్నందున చంద్రబాబు ఒక్కరే ప్రమాణం చేసి కార్యక్రమాన్ని ముగిస్తే బాగుంటుందనే అభిప్రయాలు వ్యక్తమైనట్లు తెలిసింది.

మంత్రి పదవులు ఆశించే వారు ఎక్కువగా ఉండటం, ఆశావాహులకు పదవులు దక్కకపోతే వారు అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జూన్ 8న చంద్రబాబు నాయుడు ఒక్కరే ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయి.
జూన్ 12నే ఉప ముఖ్యమంత్రి, మంత్రులుగా ఇతర సభ్యులతో ప్రమాణం చేయిస్తే మంచిదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవానికి సమయం దగ్గరపడుతుండటంతో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఏర్పాట్లను గుంటూరు జిల్లా కలెక్టర్ సురేష్ కుమార్ పర్యవేక్షిస్తున్నారు. అన్ని శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. 10వేల మందితో భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు.












Click it and Unblock the Notifications