తెలుగు రాష్ట్రాల్లో గసగసాల సాగు దుమారం .. కొనసాగుతున్న అరెస్ట్ ల పర్వం .. డ్రోన్లతో నిఘా
తెలుగు రాష్ట్రాల్లో గసగసాల సాగు దుమారం సృష్టిస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా గసగసాల సాగు జరుగుతోందని, ఇంత సీక్రెట్ గా గసగసాల సాగు చేయాల్సిన అవసరం ఏంటి అన్న దానిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. అసలు గసగసాల సాగు వెనుక ఉన్న రహస్యమేంటి అన్న చర్చ తెలుగు రాష్ట్రాల్లో జోరందుకుంది.
గసగసాల పంటను సాగు చేయాలంటే కేంద్ర ప్రభుత్వ అనుమతి అవసరం రాజస్థాన్ రాష్ట్రంలో మాత్రమే కేంద్ర ప్రభుత్వ అనుమతితో ఈ పంటను పండిస్తారు. ఈ పంటను సాగు చేయడానికి కూడా పరిమిత కాలం విధిస్తారు. అటువంటి గసగసాల సాగును తెలుగు రాష్ట్రాల్లో ఈమధ్య జోరుగా చేస్తున్నారు.

చిత్తూరు జిల్లాలో ఓపీయం సాగు దుమారం .. పంటలను ధ్వంసం చేసిన పోలీసులు
మొదట చిత్తూరు జిల్లాలో ముంబైకి చెందిన ఓ మహిళ ఏజెంట్లను ఏర్పాటు చేసుకొని చౌడేపల్లి మండలానికి చెందిన వ్యక్తి ద్వారా గసగసాల సాగుకు సంబంధించిన విత్తనాలను సరఫరా చేశారు. ఇక పంటను సాగు చేసే బాధ్యతను రైతులకు అప్పగించి, పక్వానికి వచ్చిన తర్వాత గసగసాల కాయలను కిలో 4 వేల రూపాయల చొప్పున కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకున్నారు. కష్టాల సాగు చెయ్యకూడదని తెలియని రైతులు పంటను సాగు చేశారు. తీరా పంటను ఎగుమతి చేసే సమయానికి వచ్చేసరికి పోలీసులు దాడి చేసి పంటలను ధ్వంసం చేశారు.

గసగసాల సాగుపై డ్రోన్ లతో నిఘా .. తెలంగాణలో రాచకొండ కమీషనరేట్ పరిధిలోనూ సాగు
మాలేపాడు పంచాయతీ దేవళంపల్లెలో గసగసాలు సాగు చేసిన రైతులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. అంతేకాదు చిత్తూరు జిల్లా మదనపల్లె ప్రాంతంలో గుట్టుగా సాగుతున్న గసగసాలు సాగు అరికట్టడం కోసం పోలీసులు డ్రోన్ల సహాయంతో సైతం నిర్వహించారు. అక్కడ పొలాలను జల్లెడ పట్టారు.
ఇదిలా ఉంటే ఇటు తెలంగాణ రాష్ట్రంలోనూ రాచకొండ కమిషనరేట్ పరిధిలో మొట్టమొదటిసారిగా ఓపియం పండిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లేమూరు గ్రామంలో గసగసాలు సాగు చేస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

లేమూరు గ్రామంలో రెండు ఎకరాల్లో గసగసాల సాగు .. 390 కిలోల ఓపియం కాయల స్వాధీనం
గత కొంత కాలంగా తన వ్యవసాయ క్షేత్రంలో రెండు ఎకరాల్లో గసగసాలను సాగు చేస్తున్నారు. ఇక సమాచారంతో వ్యవసాయ క్షేత్రంపై దాడి చేసి 390 కిలోల ఓపియం కాయలను స్వాధీనం చేసుకున్నారు రాచకొండ కమిషనరేట్ పోలీసులు. అసలు ఇంతకీ గసగసాల సాగు ఎందుకు చేయకూడదు అంటే మాదక ద్రవ్యాల తయారీలోనూ ఓపియం కాయలను ఉపయోగిస్తారు. ఒక గ్రాము ఓపీయం కాయతో మార్ఫిన్ తయారవుతుంది . దానికి కొంత కెమికల్ జతచేస్తే హెరాయిన్ తయారవుతుంది. ఈ హెరాయిన్ కోట్ల విలువ ఉంటుంది.

మార్ఫిన్ , హెరాయిన్ తయారీలో ఓపీయం కాయలు.. సాగు నేరం, ఎన్పిడీఎస్ యాక్ట్ కింద కేసులు
డ్రగ్స్ మాఫియా ముఠాలు గ్రామాల్లో రైతులు ప్రలోభపెట్టి రహస్యంగా ఈ పంట సాగు చేయిస్తున్నారు. ఓపియం కాయలకు గాట్లు పెడితే ఓ రకమైన జిగురు పదార్థం వస్తుంది. దానిని మార్ఫిన్, హెరాయిన్ తయారీకి ఉపయోగిస్తారు. మాదకద్రవ్యాల నిరోధక చట్టం కింద గసగసాలను సాగు చేయడం చట్టరీత్యా నేరం. దీంతో ఈ పంటను సాగు చేస్తున్న నిందితులపై ఎన్పిడీఎస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తున్నారు పోలీసులు. ఇప్పుడు తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో గసగసాలు సాగుపై గుసగుసలు జోరుగా వినిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications