కారు స్పీడ్ అందుకోలేకపోతున్న సైకిల్: కవిత, కేసీఆర్‌కు ఓయు సెగ
హైదరాబాద్: కారు వేగాన్ని సైకిల్ అందుకోలేకపోతోందని తెలంగాణ రాష్ట్ర సమితి నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి సోమవారం అన్నారు. కరీనంగర్ జిల్లాలో ఆమె మాట్లాడారు. అభివృద్ధిలో మరే విషయంలో అయినా కారు (తెరాస) స్పీడును సైకిల్ (టీడీపీ) అందుకోలేకపోతోందన్నారు.
ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ పిక్నిక్ వచ్చి వెళ్లినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. అభివృద్ధఇలో గుజరాత్ రాష్ట్రాన్ని తాము అధిగమిస్తామని చెప్పారు. జగిత్యాల నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.470 కోట్ల అభివృద్ధి పనులు చేశామన్నారు.
రైతుల పైన అన్ని పార్టీలు కపట ప్రేమను చూపిస్తున్నాయని ధ్వజమెత్తారు. రైతు సమస్యల పైన అనవసర రాద్ధాంతం చేస్తున్నారన్నారు. రానున్న నాలుగేళ్లలో పెద్ద ఎత్తున అభివృద్ధిని సాధిస్తామన్నారు. అభివృద్ధిని చూసి ప్రతిపక్షాలు బిత్తరపోయేలా ఉంటుందన్నారు.
జగిత్యాల వెనుకబాటుతనానికి కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కారణమని ఆరోపించారు. తెరాస ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని వేగంగా అభివృద్ధి చేస్తోందన్నారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు అనవసరమైన ఆరోపణలు చేయవద్దని, ఎలాంటి చర్చలకైన తాము సిద్ధమన్నారు. కాగా, నాసా నిర్వహించే స్పేస్ సెటిల్మెంట్ కాంటెస్ట్ 2015కు ఎంపికైన హైదరాబాద్ విద్యార్థిని హన్మకొండ స్టెల్లా కుమారికి కవిత రూ.లక్ష ఆర్థిక సాయం చేశారు.

ఉత్సవ విగ్రహాల్లా మంత్రులు: నాగం
ఆంధ్రప్రదేశ్‌లో ప్రాజెక్టులు త్వరతగిన పూర్తవుతుంటే తెలంగాణలో మాత్రం నత్తనడకన సాగుతున్నాయని బీజేపీ నేత నాగం జనార్ధన్ రెడ్డి వేరుగా విమర్శించారు. పెండింగ్ ప్రాజెక్టులను పరిశీలించి ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామన్నారు. తెరాస నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని, మంత్రులు ఉత్సవ విగ్రహాల్లా మారారని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఓయూ భూములు తీసుకుంటే చూస్తే ఉద్యమం తప్పదని నాగం హెచ్చరించారు.
ట్రాఫిక్ మళ్లింపుపై స్థానికుల ఆందోళన, చిక్కుకుపోయిన మంత్రి
కేపీహెచ్‌బీ కాలనీలో పైప్‌లైన్ పనుల నిమిత్తం పోలీసులు ట్రాఫిక్ మళ్లింపులు చేయడంతో స్థానికులు ఆందోళనకు దిగారు. దీంతో మంత్రి మహేందర్ రెడ్డి ట్రాఫిక్‌లో చిక్కుకుపోయి అవస్థలు పడ్డారు.
మంత్రి ఈటెల కాన్వాయ్‌కు తప్పిన ప్రమాదం
కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలం మెట్‌పల్లి దగ్గర మంత్రి ఈటెల రాజేందర్ కాన్వాయ్‌కు ప్రమాదం తప్పింది. ప్రమాదవశాత్తు మంత్రి కాన్వాయ్‌లోని ఓ వాహనం చెట్టుని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు.
కేసీఆర్ పైన కాంగ్రెస్ ఆగ్రహం
హైదరాబాదులో ఓయు లేకుండా చేసే కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ దుయ్యబట్టారు. అక్రమ స్థలాల పేరుతో ఉన్న స్థలాలను లాక్కుంటున్నారని ఆరోపించారు. ఓయూ స్థలం జోలికి వస్తే సహించేది లేదని ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఓయూ స్థలంలో పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామంటూ సీఎం కేసీఆర్ గ్రేట్‌ర్ ఎన్నికల కోసం నాటకం ఆడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం ఆ స్థలంలో అంగుళం భూమి తీసుకున్నా పోరాటం తప్పదని హెచ్చరించారు. రాహుల్ పరామర్శించిన రైతుల ఆత్మహత్యల ఎఫ్ఐఆర్ కాపీలు తమ దగ్గర ఉన్నాయన్నారు.
అవి అసలివో డూప్లికేటువో ప్రభుత్వం విచారణ జరపాలన్నారు. నిజమని తేలితే మంత్రి తుమ్మల నాగేశ్వర రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రైతు ఆత్మహత్యల పైన తుమ్మల వ్యాఖ్యలు ఏమాత్రం సరికాదన్నారు. ఆత్మహత్యల ఎఫ్ఐఆర్ కాపీల పైన తుమ్మల ఏం చెబుతారని ప్రశ్నించారు. ఉద్యమ బిడ్డలు రోడ్ల పైన ఉంటే, ద్రోహులు పాలిస్తున్నారని ధ్వజమెత్తారు.
కాగా, ఉస్మానియా యూనివర్సిటీలో పదకొండు ఎకరాలను కొనుగోలు చేసి, ఆ భూముల్లో నిరుపేదలకు ఇళ్లు కట్టించి ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. మౌలిక సదుపాయాలు కావాలంటే ఇళ్లను కోల్పోక తప్పదని తేల్చి చెప్పారు.
స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు ఆయన పార్శీగుట్ట ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా తమకు 70 అడుగుల రోడ్లు, మంచినీళ్లు కావాలని స్థానికులు కోరారు. ఇందుకు కేసీఆర్ మాట్లాడారు.
దశలవారీగా పది వేల ఇళ్లు కట్టిస్తామన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో 11 ఎకరాలను కొనుగోలు చేసి పేదలకు ఇళ్లు కట్టిస్తానన్నారు. ఒకవేళ అక్కడ స్థలం దొరకకపోతే, ఉప్పల్ చౌరస్తా దగ్గర సీసీఎంబీ, రైల్వేకు సంబంధించిన స్థలాలు ఉన్నాయని, వాటిని కొనుగోలు చేసి ఇళ్లు కట్టిస్తానని చెప్పారు.
కేసీఆర్ వ్యాఖ్యలపై ఓయూ జేఏసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ భూములను ధారాదత్తం చేయడానికి అవేమీ కేసీఆర్ అబ్బ సొత్తు కాదని, ఓయూకు సంబంధించి ఒక్క అంగుళం జాగా కూడా వదులుకోబోమని ఓయూ జేఏసీ చెబుతోంది.












Click it and Unblock the Notifications