మా రాజకీయ భవిష్యత్ ముగిసింది, సిద్ధమే: ఉండవల్లి
హైదరాబాద్: రాష్ట్ర విభజన ప్రక్రియతో తమ రాజకీయ భవిష్యత్ ముగిసిందని సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. తమ రాజకీయ భవిష్యత్ ముగిసిందని, తాము కూడా అందుకు సిద్ధపడ్డామని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ బిల్లుపై రాష్ట్ర శాసనసభలో చర్చ జరగాల్సిందేనని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.
అసెంబ్లీలో రాష్ట్ర విభజన బిల్లుపై చర్చ జరగాలని, అందుకు అన్ని పార్టీల సభ్యులు సహకరించాలని కోరారు. బిల్లుపై విస్త్రృతమైన చర్చ జరిగితేనే అభిప్రాయాలు వ్యక్తం చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. జనవరి 23 లోగా తెలంగాణ బిల్లుపై అభిప్రాయాలు తెలుపాలని, లేదంటే బిల్లుపై చర్చ జరిగినట్లు భావించి పార్లమెంటులో ప్రవేశపెట్టే అవకాశం ఉంటుందని స్పష్టం చేశారు. శాసనసభలో బిల్లుపై చర్చ జరగడం సీమాంధ్రకే కాకుండా తెలంగాణకు కూడా అవసరమని ఆయన అన్నారు.

పార్లమెంటుకు తెలంగాణ బిల్లు వచ్చినట్లయితే సీమాంధ్ర ఎంపీలమందరం అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తామని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. రాష్ట్ర విభజన అంశం పార్టీలకు సంబంధించింది కాదని, పార్టీల కతీతంగా సమైక్యం కోసం పోరాడాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికలు దృష్టిలో ఉంచుకుని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోకుండా, అందరూ కలిసి సమైక్యం కోసం పోరాటం చేయాలని ఉండవల్లి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే మరిన్ని రాష్ట్రాల నుంచి కూడా డిమాండ్లు వస్తాయని తెలిపారు.
ఆర్టికల్ 3 ప్రకారం రాష్ట్ర అసెంబ్లీలో అభిప్రాయాలు తీసుకుంటున్నారని తెలిపారు. అయితే పరిగణలోకి తీసుకోని అభిప్రాయాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. అసెంబ్లీలో మెజార్టీ సభ్యులు వ్యతిరేకించిన సమయంలో రాష్ట్ర విభజన జరిగిన సందర్భాలు దేశంలో లేవని ఆయన అన్నారు. మూడు ప్రాంతాలు ఆమోదిస్తేనే రాష్ట్ర విభజన చేయాలని శ్రీకృష్ణ కమిటీ చెప్పిందని తెలిపారు. 1972లో ఆంధ్రా ఉద్యమం వచ్చినందువల్లే ముల్కీ నిబంధనలను రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో అనాటి ప్రధాని ఇందిరా గాంధీ తొలగిస్తూ ప్రకటన చేశారని తెలిపారు.
371డిని కూడా అప్పుడే తీసుకురావడం జరిగిందని జరిగిందని ఉండవల్లి చెప్పారు. 371 డి ఆర్టికల్‌ను తొలగించడానికి 2/3 మెజార్టీ కావాలని అన్నారు. 60 ఏళ్లుగా ఉద్యమం సాగుతోందని, తెలంగాణ ప్రజలకు ఇష్టం లేకున్నా రీ ఆర్గనైజింగ్ కమిషన్ ఆంధ్రా, తెలంగాణలను కలిపిందనడం సరికాదన్నారు. 1952లో హైదరాబాద్ రాష్ట్రానికి బూర్గుల రామకృష్ణారెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, ఆ తర్వాత అసెంబ్లీలో మెజార్టీ సభ్యుల అభిప్రాయంతోనే హైదరాబాద్ రాష్ట్రంతో సీమాంధ్ర ప్రాంతాన్ని కలిపి 1956లో ఆంధ్రప్రదేశ్‌ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.
అనాటి నుంచి తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందిందా లేదా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్ర విభజన బిల్లుపై చర్చించేందుకు అన్ని పార్టీలకు చెందిన ఇరు ప్రాంతాల సభ్యులు సహకరించాలని కోరారు. అసెంబ్లీలో చర్చ అనంతరం జనవరి 23 తర్వాత బిల్లు పార్లమెంటుకు వెళుతుందని తెలిపారు. పార్లమెంటులో తెలంగాణ బిల్లుతోపాటు మహిళా బిల్లు, మత బిల్లులను కూడా ఆమోదించే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర విభజన ఒక్క రోజులో జరిగేది కాదని ఆయన అన్నారు. రాష్ట్రాలన్నీ శానససభల తీర్మానాలతోనే ఏర్పడ్డాయని ఆయన అన్నారు.
మత బిల్లుతో రాష్ట్రాలపై కేంద్రం అధికారం పెరిగిపోతుందని, ఫెడరల్ వ్యవస్థకు దారితీస్తుందని భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ అంటున్నారని తెలిపారు. అయితే తెలంగాణ విషయంలో కేంద్రం తీసుకున్న ఫెడరల్ నిర్ణయాన్ని ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. పార్లమెంటులో కూడా తెలంగాణపై ఆసక్తికర చర్చ జరుగుతుందని ఉండవల్లి అరుణ్ కుమార్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రయను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ చేసిందని, అందులో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన నేతలు ఎవరూ కూడా లేరని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications