స్వర్ణగ్రామం, స్వర్ణవార్డు ఉద్యోగులకు వరుస షాక్ లు- తీవ్ర ఒత్తిడిలో..!
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అమల్లోకి తెచ్చిన సచివాలయ వ్యవస్థకు చంద్రబాబు ప్రభుత్వం తాజాగా స్వర్ణ గ్రామం (Swarna gramam), స్వర్ణ వార్డు (swarna ward)ల పేర్లు పెట్టింది. దీంతో పాటు ఉద్యోగుల (employees)హేతుబద్ధీకరణ చేసింది. అనంతరం వారిపై తీవ్ర ఒత్తిడి పెంచుతోంది. ఓవైపు సర్వేలు, మరోవైపు యోగాంధ్ర నమోదు కార్యక్రమాలు, ఇంకోవైపు ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణ (ఎస్ఐఆర్) ఇలా వరుసగా ఒత్తిడి పెంచేస్తోంది. దీన్ని తట్టుకోలేక రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉద్యోగులు అనారోగ్యానికి గురై చనిపోతున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డుల సిబ్బందికి పలు పనుల్ని ఒకేసారి అప్పగించారు. వీటిలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర సర్వేలు, యోగాంధ్ర రిజిస్ట్రేషన్లు, ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణలు, ఎప్పుడూ ఉండే పథకాలు ఉన్నాయి. ఇవన్నీ ఒకేసారి చేయాల్సి రావడం ఉద్యోగులకు తీవ్ర భారంగా మారుతోంది. వివిధ ప్రభుత్వ శాఖలు ఉన్నా వాటిని కాదని ఇలా స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు ఉద్యోగులకే అన్ని పనులు అప్పగించడం ద్వారా ప్రభుత్వం ఒత్తిడి పెంచుతోంది.

ప్రత్యేక ఓటర్ల జాబితాల సవరణలో పాల్గొంటున్న ఉద్యోగులకు సకాలంలో మ్యాపింగ్ పూర్తి కాకపోతే కూడా షోకాజ్ నోటీసులు ఇస్తున్నారు. అలాగే ఆస్తిపన్ను డిమాండ్ నోటీసుల జారీ బాధ్యతలు సైతం వీరికే అప్పగించారు. మరోవైపు జన గణన వివరాల నమోదుకు ఇంటింటికీ తిప్పుతున్నారు. వీటికి తోడు తాజాగా స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర సర్వే, యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు చేయించే బాధ్యతలు కూడా అప్పగించేశారు. దీంతో ఉద్యోగులపై ఒత్తిడి అంతకంతకూ పెరుగుతోంది. వీటికి తోడు సాధారణంగా ఉండే సంక్షేమ పథకాల బాధ్యతలు కూడా నిర్వర్తించాల్సి వస్తోందని ఉద్యోగులు వాపోతున్నారు. ఎస్ఐఆర్ వంటి పనుల్ని ఇతర శాఖల సిబ్బందికి కూడా సమానంగా పంచే అవకాశం ఉన్నా సచివాలయ ఉద్యోగుల్నే ఎంచుకోవడంపై వారు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ప్రభుత్వానికి ఈ విషయాలపై విన్నవించినా ఫలితం లేదని వాపోతున్నారు.














Click it and Unblock the Notifications