పాడేరు టూ తమిళనాడు: ఆగని దందా; బంగాళాదుంపల మాటున 790 కిలోల గంజాయి
గంజాయి అక్రమ రవాణాను అడ్డుకోవడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసులు,స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు, ఎక్సైజ్ అధికారులు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. నిత్యం వాహన తనిఖీలు చేస్తూ గంజాయి దందాను అడ్డుకుంటున్నారు. అయినప్పటికీ అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. కూరగాయల మాటున, ఉల్లిపాయల మాటున ఏదో ఒక రకంగా గంజాయిని అక్రమ రవాణా చేస్తున్నారు.

బంగాళాదుంపల మాటున గంజాయి అక్రమ రవాణా
తాజాగా పాడేరు నుంచి తరలిస్తున్న 790 కిలోల గంజాయి బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగాళదుంపల వ్యాన్లో అడుగున గంజాయిని పెట్టి అక్రమ రవాణా చేస్తున్న క్రమంలో దువ్వాడ పోలీసులకు సమాచారం అందడంతో దువ్వాడ పోలీసులు దాడి చేశారు.అగనంపూడి టోల్ గేట్ వద్ద వాహన తనిఖీలు చేపట్టి గంజాయి బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయి బస్తాలను పాడేరు నుండి తమిళనాడు చేరవేయడానికి నిందితులు ప్లాన్ చేసినట్లుగా దర్యాప్తులో పోలీసులు తేల్చారు.

పాడేరు నుండి తమిళనాడుకు గంజాయి రవాణా.. అడ్డుకున్న పోలీసులు
పాడేరు నుంచి వీఎస్ఈజెడ్ కు సమీపంలోని డాక్ యార్డ్ కాలనీలోని స్టాక్ యార్డ్ కు వీటిని తరలించి, తర్వాత అక్కడి నుండి రైలు లేదా రోడ్డు మార్గంలో తమిళనాడుకు చేరవేయడానికి నిందితులు ప్లాన్ చేశారని పోలీసులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే గంజాయిని తరలిస్తున్న సమయంలో పక్కా సమాచారంతో దాడి చేసిన పోలీసులు గంజాయిని సీజ్ చేయడం తో పాటుగా, తమిళనాడు రాష్ట్రానికి చెందిన భాస్కర్, చంద్రశేఖర్, జాన్సన్ శంకర్ లతో పాటు డాక్ యార్డ్ కాలనీకి చెందిన దుక్కా నరేష్ లను అరెస్ట్ చేశారు. ఇక ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు.

నిత్యకృత్యంగా గంజాయి అక్రమ రవాణా .. పట్టుకోవటం కష్టమే
గతంలోనూ అనేకసార్లు బొగ్గుల లారీలలో, కలప లారీలలో, ఉల్లిపాయలు లారీలలో, ఆలుగడ్డల లారీలలో, కూరగాయలు రవాణా చేసే వాహనాలలో గంజాయి పట్టుబడింది. పక్కా సమాచారం వస్తేనే వాహనంలో ఉన్న సరుకునంతా పరిశీలిస్తున్న పోలీసులు గంజాయి పట్టుబడితే కేసులు నమోదు చేస్తున్నారు. సమాచారం అందని చాలా వాహనాలలో గంజాయి అక్రమ రవాణా జరుగుతుందన్నది ప్రస్తుతం అందరికీ ఉన్న అనుమానం. ఇతర రాష్ట్రాల్లో దొరుకుతున్న గంజాయి ఏపీ నుండి వచ్చినట్లుగా ప్రధానంగా చర్చ జరుగుతున్న సమయంలో గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వం మరింత కఠిన నిర్ణయాలు దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.

గంజాయి సాగు ఆపటం కోసం ఆపరేషన్ పరివర్తన్
ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఆపరేషన్ పరివర్తన్ కార్యక్రమం ద్వారా గంజాయి సాగును నిర్మూలించడానికి రంగంలోకి దిగింది. పోలీసులు, ఎక్సైజ్ అధికారులు, రెవెన్యూ అధికారులు, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సంయుక్తంగా విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలలోని ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న గంజాయి సాగును ధ్వంసం చేయడంపై దృష్టి సారించారు. అక్కడి స్థానికులకు అవగాహన కల్పించడంతో పాటుగా, ప్రత్యామ్నాయ మార్గాలపై చర్చిస్తున్నారు. ఇక తాజాగా విశాఖపట్నం జిల్లా పాడేరు, చింతపల్లి ఏజెన్సీ ప్రాంతంలో గంజాయి సాగును నిర్మూలించాలని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

గంజాయి నిర్మూలనకు ప్రయత్నాలు చేస్తున్నా అడ్డదారుల్లో దందా
గంజాయి సాగు, అక్రమ రవాణా వల్ల గిరిజనులకు జరుగుతున్న నష్టంపై అవగాహన కల్పించి, విద్యార్థులు వారి తల్లిదండ్రులను చైతన్య పరచవలసిందిగా సూచించారు. గంజాయి సాగు వద్దు వ్యవసాయమే ముద్దు అన్న నినాదాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఒకపక్క గంజాయిని నిర్మూలించడానికి పోలీసులు అధికారులు నానా తంటాలు పడుతుంటే, మరోపక్క విశాఖ ఏజెన్సీ నుంచి ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న గంజాయి నిత్యం ఎక్కడో ఒక చోట పట్టుబడుతూనే ఉంది. కాదేదీ అక్రమ రవాణాకు అనర్హం అన్న చందంగా గంజాయి స్మగ్లర్లు రెచ్చిపోతూనే ఉన్నారు. గంజాయి అక్రమ రవాణాకు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు.












Click it and Unblock the Notifications