మితిమీరొద్దు, మా బాధ మాది: టీ ప్రభుత్వానికి పరకాల
హైదరాబాద్: కార్మికశాఖలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన వందల కోట్ల రూపాయల నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తరలి వెళ్లాయన్న ఆరోపణల పైన పరకాల ప్రభాకర్ గురువారం స్పందించారు. ఆయన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వం తమ ఆగడాలను ఆపాలని, మితిమీరొద్దని, తమ అధికారుల పైన ఎలా చేయి చేసుకుంటారని ఆయన ప్రశ్నించారు.
తెలంగాణకు చెందిన రూ.410 కోట్లు తరలిపోయాయన్న ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రూ.76 కోట్లు ఇంకా తెలంగాణ బ్యాంకులో ఉన్నాయని ఆయన చెప్పారు. ఆచార్య ఎన్టీ రంగా వర్సిటీ, నీళ్లు, ఫీజు రీయింబర్సుమెంట్స్.. తదితర అంశాల్లో తెలంగాణ ప్రభుత్వం కయ్యానికి కాలు దువ్వుతోందన్నారు. ఇది సరైన పద్ధతి కాదన్నారు.

ఏపీకి చెందిన అధికారి పైన ఎలా చేయి చేసుకుంటారని ప్రశ్నించారు. సచివాలయంలోకి పోలీసులు రావొద్దని, కానీ ఎలా వచ్చారన్నారు. తెలంగాణలో అసలు చట్టం ఉందా, ప్రభుత్వం ఉందా, రాజ్యాంగం ఉందా, రాజ్యాంగం చట్టాలు ఉన్నాయని మీకు స్పృహ ఉందా అని ప్రశ్నించారు. ఇంత దుర్మార్గంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.
ఈ అరాచకాన్ని తెలంగాణ ప్రజలు, తెలుగు ప్రజలు తెరాస ప్రభుత్వాన్ని ప్రశ్నించాలన్నారు. తాము అనేక ఇబ్బందుల్లో ఉన్నామని, తాము కయ్యానికి కాలు దువ్వడం లేదన్నారు. ఏపీ అధికారుల పైన చేయి చేసుకునే అధికారం మీకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. తమ డ్రైవర్ గల్లా పట్టి, మీ డ్రైవర్‌ను ఎక్కించారని ఆరోపించారు. మా అధికారిల పైన ఈగవాలినా ఊరుకోమన్నారు.
తెలంగాణ ప్రభుత్వం తమ ఆగడాలు ఆపకపోతే తెలుగు ప్రజలకు, తెలుగు జాతికి ఏమాత్రం మంచిది కాదన్నారు. అపాయింటెడ్ డే రోజున ఎన్ని నిధులు ఉన్నాయో, అందులో ఎవరికి ఎంత చెందాలో అంత వస్తాయన్నారు. తాము తెలంగాణకు చెందిన నిధులు తరలించలేదన్నారు.
విభజన నాటి నిబంధనల మేరకే: మురళీ సాగర్
నిధుల మళ్లింపులో ఎలాంటి గోల్‌మాల్ జరగలేదని మురళీసాగర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు నిధులు మళ్లించామన్నారు. వీటిపై తెలంగాణ ప్రభుత్వానికి అధికారం లేదన్నారు. బందలాయింపు సందర్భంగా తెలంగాణ సర్కారుకు చెప్పాల్సిన పని లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇందులో సభ్యులు కూడా కాదన్నారు. విభజన నాటికి ఉన్న నిబంధనల మేరకే ట్రాన్సుఫర్ చేశామన్నారు.












Click it and Unblock the Notifications