Parakamani: పరకామణి కేసులో మరో టర్న్..! ఏసీబీ, సీఐడీకి హైకోర్టు కీలక ఆదేశం..!
ఏపీలో తిరుమల శ్రీవారి ఆలయ పరకామణిలో జరిగిన చోరీ కేసులో రోజుకో ట్విస్ట్ ఎదురవుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ చోరీ కేసు ఆ తర్వాత లోక్ అదాలత్ లో రాజీ జరిగినా ప్రస్తుత కూటమి సర్కార్ దానిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టును ఆశ్రయించడంలో మరో మలుపు తిరిగింది. ఆ తర్వాత పరకామణి చోరీ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న మాజీ విజిలెన్స్ అధికారి అనుమానాస్పద స్ధితిలో చనిపోయారు. ఇదే క్రమంలో ఈ కేసుపై హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది.
పరకామణిలో రెండేళ్ల క్రితం యూఎస్ డాలర్లు చోరీ చేస్తూ టీటీడీ ఉద్యోగి రవి కుమార్ దొరికిపోయాడు. ఈ కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న విజిలెన్స్ అధికారి సతీష్ కుమార్ తాజాగా తాడిపత్రిలో రైలు పట్టాల పక్కన శవమై దొరికారు. ఈ నేపథ్యంలో పరకామణి కేసులో లోతైన దర్యాప్తు అవసరమని సీఐడీ, ఏసీబీ హైకోర్టుకు తెలిపాయి. ఈ మేరకు వీరి వినతులపై విచారణ జరిపిన హైకోర్టు.. ఈ రెండు దర్యాప్తు సంస్థలు పరకామణి కేసులో తదుపరి దర్యాప్తు జరిపేందుకు హైకోర్టు అంగీకరించింది.

పరకామణి కేసులో మరింత లోతైన దర్యాప్తు జరిపేందుకు ఏసీబీ, సీఐడీ ఇద్దరికీ అనుమతిస్తూ హైకోర్టు ఇవాళ కీలక ఆదేశాలు ఇచ్చింది. దీంతో పాటు కేంద్ర సంస్థలైన ఈడీ,ఐటీకి కూడా ఈ వివరాలు అందజేసేందుకు అనుమతి ఇచ్చింది. దీంతో ఇకపై పరకామణి కేసు దర్యాప్తు వేగం పుంజుకోనుంది. అదే సమయంలో పరకామణి చోరీ కేసులో నిందితుడిగా ఉండి టీటీడీకి ఆస్తులు రాసిచ్చి లోక్ అదాలత్ లో రాజీ చేసుకున్న రవి కుమార్ కు ఉచ్చు బిగుస్తోంది.

టీటీడీకే 100 కోట్ల ఆస్తులు రాసిచ్చిన రవికుమార్ ఆదాయ వనరులపై దర్యాప్తు జరపాలని ఇప్పటికే ఏసీబీకి హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఏసీబీ ముందు ఈ దర్యాప్తు కొనసాగించనుంది. అనంతరం పరకామణి కేసు రాజీ చేయించిన వైసీపీ నేతలపై సీఐడీ దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. దీంతో ఈ కేసులో మరిన్ని సంచలనాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications