చంద్రబాబు నిరసన దీక్ష- పోటీగా వైసీపీ జనాగ్రహ దీక్ష : టీడీపీ ప్లాన్ ...వైసీపీ కౌంటర్ స్ట్రాటజీ..!!
ఏపీలో అధికార - ప్రతిపక్షాల మధ్య రాజకీయంగా పై చేయి కోసం నువ్వా -నేనా అన్నట్లుగా కార్యాచరణ అమలు చేస్తున్నారు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి సీఎం పైన అనుచిత వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఏపీలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ముఖ్యమంత్రి పైన చేసిన వ్యాఖ్యలతో వైసీపీ శ్రేణులు ఆగ్రహించాయి. విజయవాడలోని పట్టాభి నివాసంతో పాటుగా మంగళగిరి వద్ద ఉన్న టీడీపీ కేంద్ర కార్యాలయం పైన దాడులకు దిగారు. ముఖ్యమంత్రి పైన బూతులు తిట్టటం ఏంటంటూ వైసీపీ శ్రేణులు తీవ్రంగా స్పందించాయి.

చంద్రబాబు పిలుపు..వైసీపీ కౌంటర్ ప్లాన్
ఇప్పటికే సహనంతో ఉన్నామని..ఈ స్థాయిలో బూతులు తిడుతుంటే అభిమానులు తట్టుకోలేకపోయారని వైసీపీ నేతలు చెబుతున్నారు. మరోసారి ఈ రకంగా వ్యవహరిస్తే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. పార్టీ కార్యాలయం పైన దాడులకు నిరసనగా టీడీపీ అధినేత చంద్రబాబు బుధవారం ఏపీ బంద్ కు పిలుపునిచ్చారు. దీనికి కౌంటర్ గా వైసీపీ నిరసన దీక్షలకు పిలుపునిచ్చింది. బంద్ కు ప్రయత్నించిన టీడీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వైసీపీ నేతలు చంద్రబాబు క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తూ నిరసనలకు దిగారు.

చంద్రబాబు దీక్ష - వైసీపీ పోటీ దీక్షలు
ఇక, దీనికి కొనసాగింపుగా ఏపీలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రపతి - ప్రధాని - హోం మంత్రి అమిత్ షా కు చంద్రబాబు లేఖలు రాసారు. పార్టీ కార్యాలయంలో ఎక్కడ దాడి జరిగిందో..అక్కడే చంద్రబాబు దీక్షకు దిగారు. పోలీసులు అనుమతి ఇచ్చారు. అయితే, ఇదే సమయంలో ఈ దీక్షకు కౌంటర్ గా వైసీపీ కొత్త నిర్ణయం తీసుకుంది. రాజకీయాల్లో దిగజారుడు విధానాలకు వ్యతిరేకంగా, ప్రతిపక్ష టీడీపీ.. ముఖ్యమంత్రి ని ఉద్దేశించి బూతులు మాట్లాడటాన్ని నిరసిస్తూ ఈ నెల 21, 22 తేదీల్లో రెండు రోజులపాటు జనాగ్రహ దీక్షలకు వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చింది.

36 గంటల పాటు చంద్రబాబు నిరసన దీక్ష
జనాగ్రహ దీక్షల నిర్వహణపై వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలోని పార్టీ నాయకులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రాలు సహా అన్ని జిల్లాల్లో ప్రధానమైన చోట్ల జనాగ్రహ దీక్షలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ దీక్షల్లో కేవలం పార్టీ శ్రేణులనే కాకుండా ప్రజాసంఘాలను, విద్యార్థులను, యువతను, కుల సంఘాలను, మేధావులను, పౌర సంఘాలను భాగస్వాముల్ని చేయాలన్నారు.
Recommended Video

రాజకీయంగా పై చేయి కోసం పోటా పోటీగా
రాజకీయాల్లో విలువలు పాటించాలని, హద్దుమీరి మాట్లాడి రాజకీయాలను దిగజార్చే విధానాలకు వ్యతిరేకంగా వారి సంఘీభావాన్ని పొందాలని పార్టీ శ్రేణులకు చెప్పారు. మంచి రాజీకీయ వాతావరణం ఉండాలన్నదే అభిమతమని, విద్వేష వ్యాఖ్యలు, బూతు మాటలు మాట్లాడటం మంచి వాతావరణాన్ని కలుషితం చేస్తుందనే విషయాన్ని ఎలుగెత్తి చాటాలన్నారు. సీఎం వైఎస్ జగన్‌పై టీడీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను ఖండించాలని స్పష్టం చేశారు. దీంతో..అటు చంద్రబాబు దీక్షకు అన్ని జిల్లాల నుంచి నేతలు..కార్యకర్తలు వచ్చేలా టీడీపీ ప్రయత్నిస్తోంది. ఇటు వైసీపీ అన్ని ప్రాంతాల్లోనూ జనాగ్రహ దీక్షలు నిర్వహించేలా వైసీపీ సిద్దం అవుతోంది. దీంతో.. శుక్రవారం సాయంత్రం వరకు రెండు పార్టీల నేతల పోటా పోటీల దీక్షలతో రాష్ట్రంలో పొలిటికల్ హీట్ కంటిన్యూ కానుంది.












Click it and Unblock the Notifications