కేసీఆర్ రిజైన్ చేసే ఆధారాలు: పత్తిపాటి, వాయిస్ టెస్ట్‌కు బాబుకు నోటీసు, సీఎం రమేష్‌కూ?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు రాజీనామా చేసే పరిస్థితి రావొచ్చని, తమ వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూలిపోయే ఆధారాలు ఉన్నాయని ఏపీ మంత్రి పత్తిపాటి పుల్లారావు మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు.
తెలుగుదేశం ఇరకాటంలో పెట్టేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఏపీలో కేసీఆర్ పైన 87 కేసులు నమోదయ్యాయని చెప్పారు. కేసీఆర్ పైన నమోదైన కేసుల పైన సిట్ విచారణ జరుగుతోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ పైన తమ వద్ద ఆధారాలు ఉన్నాయని చెప్పారు.
తప్పుడు కేసులకు చంద్రబాబు నాయుడు రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం కూలిపోయే ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. వారు ఒక్క అడుగు వేస్తే తాము వంద అడుగులు వేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు.
మత్తయ్యకు బెదిరింపులపై సీబీసీఐడీ విచారణ

మత్తయ్యకు బెదిరింపుల పైన సీబీసీఐడీ విచారణ జరిపిస్తామని చెప్పారు. కోడ్ అమల్లోకి వచ్చాక ఈసీ జోక్యం చేసుకోవాల్సిన అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం ఎలా తీసుకుందని ప్రశ్నించారు. హైదరాబాదులో తమకు ఏపీ పోలీసులు సేవలు అందిస్తారని చెప్పారు. సెక్షన్ 8 విభజన చట్టంలో అంతర్భాగమని చెప్పారు.
చంద్రబాబుకు నోటీసులు ఇస్తారా?
ఓటుకు నోటు కేసులో ఏసీబీ దర్యాప్తు ముమ్మరం చేసింది. అన్ని చర్యలకు ఏసీబీ సిద్ధమైంది. సీఎం కేసీఆర్‌కు, గవర్నర్‌కు తెలంగాణ ఏసీబీ సమాచారం అందించింది. నోటీసుల జారీకి ఉన్నతస్థాయి నుంచి అనుమతి లభించింది. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ బలమైన ఆధారాలు సేకరించిందని సమాచారం.
గవర్నర్‌తో తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ, ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న అధికారులతో ఏసీబీ డీజీ ఏకే ఖాన్ సమావేశం కానున్నారు. కొన్ని గంటల్లో ఈ కేసుకు సంబంధించి చంద్రబాబుకు ఏసీబీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.
చంద్రబాబుతో పాటు టీడీపీ మరో ముఖ్య నేత, ఎంపీ సీఎం రమేష్ కు ఏసీబీ నోటీసులు ఇవ్వడానికి రంగం సిద్ధం చేసింది. వాయిస్ టెస్టు కోసం హాజరు కావడానికి వీరిద్దరికీ నోటీసులు జారీ చేయనున్నట్లు సమాచారం. ఈ కేసులో డబ్బు సమకూర్చింది సీఎం రమేషేనని ఏసీబీ వద్ద పక్కా ఆధారాలున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications