మరో ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించిన పవన్ కళ్యాణ్..!!
ఏపీలో ఎన్నికల రాజకీయం హోరా హోరీగా మారుతోంది. ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ఇప్పటికే సీఎం జగన్, చంద్రబాబు, పవన్ తమ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. కూటమిగా మూడు పార్టీలు బరిలో నిలవగా, కాంగ్రెస్ తో కలిసి వామపక్షాలు మరో కూటమిగా పోటీ చేస్తున్నాయి. వైసీపీ సింగిల్ గా ఎన్నికల్లో తల పడుతోంది. కూటమిలో సీట్ల ప్రకటన దాదాపు పూర్తయింది. తాజాగా పవన్ కల్యాణ్ తమ పార్టీ నుంచి మరో అభ్యర్దిని ప్రకటించారు.
జనసేనకు కూటమిలో ఒప్పందంలో భాగంగా 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాలు దక్కాయి. అందులో పవన్ ఇప్పటి వరకు 18 స్థానాలకు అభ్యర్దులను అధికారికంగా ప్రకటించారు. అదే విధంగా మచిలీపట్నం ఎంపీ అభ్యర్దిగా బాలశౌరి పేరు ఖరారు చేసారు. పవన్ కల్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. కాకినాడ ఎంపీ అభ్యర్దిగా ఉదయ్ శ్రీనివాస్ పేరు ఖాయమైంది. మూడు పెండింగ్ స్థానాల్లో భాగంగా విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస యాదవ్ పేరును పవన్ కల్యాణ్ ప్రకటించారు. వంశీకృష్ణ అభ్యర్దిత్వం పైన స్థానికంగా నిరసనలు కొనసాగాయి. దీంతో, ఇక్కడ అభ్యర్దిని ప్రకటించటం పైన ఆలస్యం జరిగింది. ఇప్పుడు పవన్ ఆ స్థానం నుంచి వంశీకృష్ణ పేరునే ప్రకటించారు.

వంశీకృష్ణ గతంలో వైసీపీలో పని చేసారు. ఆ పార్టీలో ఎమ్మెల్సీగా ఉన్నారు. జనసేనలో చేరిన సమయం నుంచి విశాఖ సౌత్ సీటును ఆశించారు. దీంతో, స్థానికంగా కొందరు నేతలు విభేదించినా పవన్ ఇప్పుడు సీటు ఖరారు చేసారు. దీంతో..జనసేన కు కేటాయించిన 21 స్థానాల్లో మరో రెండు నియోజకవర్గాలకు అభ్యర్దులను ప్రకటించాల్సి ఉంది. పాలకొండ, అవనిగడ్డ స్థానాలపై ఇంకా కసరత్తు కొనసాగుతోంది. పాలకొండ నుంచి వైసీపీ అభ్యర్దిగా మహిళ ఉండటంతో..ఇక్కడ మహిళకు ఇవ్వాలని పవన్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా అవగనిగడ్డ నుంచి ఇక్కుర్తి శ్రీనివాస్, వంగవీటి రాధాలో ఒకరికి అవకాశం దక్కుతుందని ప్రచారం సాగుతోంది. అయితే, రాధా పోటీ విషయంలో స్పష్టత ఇవ్వలేదని సమాచారం.












Click it and Unblock the Notifications