కిరణ్ ఎఫెక్ట్: డేట్ మార్చిన పవన్, పుస్తకంలో ఏముంది?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తన సన్నిహితులతో కలిసి త్వరలో రాజకీయ ప్రకటన చేయనున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. తొలుత ఈ నెల 12వ తేదీన ప్రకటన చేయాలని పవన్ భావించారట. అయితే, అదే రోజు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కొత్త పార్టీ బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో పవన్ ముందుకు జరిపారట. సన్నిహితులతో కలిసి 12న సాయంత్రం రాజకీయ ప్రకటన చేయాలని పవన్ తొలుత నిర్ణయించారట.
గురువారం సాయంత్రం కిరణ్ తన కొత్త రాజకీయ పార్టీపై ప్రకటన చేసి.. రాజమండ్రిలో 12వ తేదీన బహిరంగ సభ ఉంటుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో పవన్ తన తేదీను ముందుకు జరుపుకున్నారని చెబుతున్నారు. ఈ మేరకు రెండు రోజుల్లో సమావేశం నిర్వహించి, రాజకీయ పార్టీ పెట్టాలా లేక స్వతంత్రులుగా పోటీ చేయాలా అని చర్చించనున్నట్లు తెలుస్తోంది.

పవన్ ఆదివారం లేదా ఆ తర్వాత రోజు ప్రకటన చేసే అవకాశాలున్నాయి. ఎన్నికల షెడ్యూలు విడుదలైన నేపథ్యంలో రాజకీయ పార్టీ ఏర్పాటు చేసేందుకు ప్రస్తుతం సమయం సరిపోదని భావిస్తున్నారట. స్వతంత్రులుగా పోటీ చేసేందుకే ఆసక్తి కనబరుస్తున్నారట. పవన్ మల్కాజిగి లేదా కాకినాడ నుండి బరిలోకి దిగే అవకాశాలున్నాయంటున్నారు.
పవన్ పుస్తకంలో ఏముంది!?
దేశ రాజకీయాలు ఏ దిశగా ఉండాలనే విషయంలో పవన్ ఇప్పటికే ఒక పుస్తకం రాశారని, దానిలోని అంశాలనే తన పార్టీ మేనిఫెస్టోలో చేర్చుతారని వినిపిస్తున్నది. ఈ పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు ఈ నెల 12న హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో ఏర్పాటు చేసే సభలోనే తన రాజకీయ రంగ ప్రవేశాన్ని కూడా ప్రకటిస్తారని సమాచారం. పవన్ కల్యాణ్ రాజకీయాలపై తన అభిప్రాయాలను పుస్తకంగా రాసినట్లు తెలుస్తోంది. ప్రతి ఒక్కరి చేతిలో ఈ పుస్తకం ఉండేలా చూడాలని భావిస్తున్నారు.
పవన్ పుస్తకంలో.. ప్రభుత్వాలు ఎలా పని చేయాలి? సమాజం మారాలంటే ఏం చేయాలి? అందుకోసం ఎలాంటి ప్రణాళికలు రచించాలి? ఇలాంటి అనేక అంశాలపై పవన్ తన అభిప్రాయాలను ఈ పుస్తకంలో పొందుపర్చినట్లు తెలుస్తోంది. పవన్‌కు రాజకీయ అవగాహన ఎక్కువ అని, ప్రపంచ రాజకీయాల గురించి ఆయనకు బాగా తెలుసునని, పుస్తకాలు కూడా విరివిగా చదువుతారని, ఆ పరిజ్ఞానంతో అప్పుడప్పుడు తన అభిప్రాయాలను ఆయన అక్షరీకరించారని, అవన్నీ పుస్తక రూపంలో తీసుకొస్తున్నారని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications