
ఆ ముగ్గురు నేతలు కావాలంటున్న పవన్ కల్యాణ్?
జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏ నియోజకవర్గం నుంచి పోటీచేయాలనేది ఖరారు కాకపోయినప్పటికీ పవన్ మాత్రం ముందుగా తాను గెలవడంకన్నా మాజీ మంత్రులు ముగ్గురిని ఓటమిపాలు చేయాలన్నదే లక్ష్యంగా కనిపిస్తోంది. మొదటి నుంచి తనపై, తన పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న వీరికి కచ్చితంగా చెక్ పెట్టాల్సిందేనని భావిస్తున్నట్లు జనసేన వర్గాలు వెల్లడించారు.

ఉమ్మడి కృష్ణా జిల్లాకు చెందినవారే
ఆ ముగ్గురికి సంబంధించిన నియోజకవర్గాలు కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే ఉన్నారు. విజయవాడ పశ్చిమ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వెల్లంపల్లి శ్రీనివాస్, గుడివాడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడాలి నాని, మచిలీపట్నం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పేర్ని నానిలను ఈసారి ఎన్నికల్లో ఓడించడానికి ఆయన పావులు కదుపుతున్నారు. తెలుగుదేశం పార్టీతో పొత్తు ఉన్నప్పటికీ ఈ మూడు నియోజకవర్గాలను ప్రత్యేకంగా జనసేన కోసం వదిలిపెట్టాలని చంద్రబాబును కోరే అవకాశం ఉందంటున్నారు.

వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడంతో టార్గెట్ అయ్యారు?
రానున్న ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు జనసేన ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. దీనికోసం బస్సు యాత్రను కూడా వాయిదా వేశారు. త్వరలోనే జిల్లా స్థాయిలో సమీక్షలు చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. ఈ పరిణామం ఆ పార్టీ శ్రేణులల్లో ఆనందం కలిగించింది. ఈ ముగ్గురు మంత్రులు ప్రస్తుతం మాజీలయ్యారు. వారు మంత్రులుగా ఉన్నప్పుడు, ఆ తర్వాత కూడా పవన్ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తేవారు. అంతేకాకుండా వారు పవన్‌ను వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేస్తుండటంతో జనసేన తిరిగి వారిని టార్గెట్ చేస్తోంది.

కాపుల ఓట్లను సమీకరిస్తే చాలనే భావన!
విజయవాడ పశ్చిమలో వెల్లంపల్లి శ్రీనివాస్ మీద భారీగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇక్కడ జనసేన నుంచి పోతిన మహేష్ పనిచేస్తున్నారు. ఆ వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలుచుకుంటే చాలనే భావనలో మహేష్ ఉన్నారు. మచిలీపట్నంలో కాపుల ఓట్లను సమీకరించగలిగితే నాని మీద విజయం సునాయమవుతుందనే భావనలో జనసేనాని ఉన్నారు. అక్కడ నుంచి ఎవరిని బరిలోకి దింపాలనే నిర్ణయాన్ని తర్వాత తీసుకుంటారంటున్నారు. గుడివాడలో కొడాలిని ఓడించడానికి, ఆయనకు ఓటర్లుగా ఉన్న తన అభిమానులను పార్టీవైపు తిప్పే ప్రయత్నాలను ప్రారంభించారు. పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు ఎంతవరకు సఫలీకృతమవుతాయో తెలియాలంటే కొద్దిరోజులు వేచిచూడక తప్పదు.