ఢిల్లీలో పవన్ కళ్యాణ్: మోడీతో దోస్తీ, బిజెపితో చర్చలు?
హైదరాబాద్: బిజెపితో దోస్తీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. బిజెపి అగ్రనేతలతో చర్చలు జరపడానికి ఆయన ఢిల్లీ చేరినట్లు సమాచారం. రాష్ట్రంలో బిజెపి, తెలుగుదేశం, జనసేన పార్టీలతో మహా కూటమిని ఏర్పాటు చేసి, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలను దెబ్బ తీయాలనే వ్యూహరచన సాగుతున్నట్లు తెలుస్తోంది.
పవన్ కళ్యాణ్ తనకు 3 లేదా 4 పార్లమెంటు సీట్లు కావాలని బిజెపి నేతలను అడిగినట్లు చెబుతున్నారు. బిజెపి అందుకు అంగీకరించినట్లుగా కూడా సమాచారం. అయితే, తన పార్టీ స్థాపన వెనక పనిచేసిన పొట్లూరి వరప్రసాద్‌కు విజయవాడ టికెట్ కేటాయించాలని ఆయన అడిగినట్లు చెబుతున్నారు. అయితే, అందుకు బిజెపి అంగీకరించడం లేదని సమాచారం.

పొట్లూరి వరప్రసాద్‌పై కేసులు ఉన్నందు వల్ల సీటు కేటాయిస్తే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని బిజెపి నేతలు అంటున్నట్లు సమాచారం. అదే సమయంలో విజయవాడ సీటును మాజీ కేంద్ర మంత్రి దగ్గుబాటి పురంధేశ్వరికి కేటాయించాలనే ఆలోచనలో బిజెపి ఉన్నట్లు చెబుతున్నారు. మహా కూటమి ఏర్పాటు తర్వాత తెలుగుదేశం, బిజెపిలకు అనుకూలంగా పవన్ కళ్యాణ్ సీమాంధ్రలోనే కాకుండా తెలంగాణలో కూడా విస్తృతంగా పర్యటిస్తారని చెబుతున్నారు.
ఇలా ఉండగా, పవన్ కళ్యాణ్ పుస్తకం ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మరోసారి వేదిక మీదికి వచ్చి ప్రసంగించే అవకాశం ఉందని, ఈ వేదిక మీది నుంచి తాను ఎవరి వైపు ఉండేది స్పష్టంగా వివరిస్తారని అంటున్నారు.












Click it and Unblock the Notifications