పవన్ నోట మళ్లీ ఆ డిమాండ్..! తిరుమల లడ్డూ కల్తీ నిర్ధారణ వేళ ..!
ఏపీలో తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం మరోసార కలకలం రేపుతోంది. తాజాగా సిట్ గత ఐదేళ్లలో తిరుమల లడ్డూ తయారీ కోసం సరఫరా చేసిన నెయ్యి అసలు పాలతో తయారు చేసిందే కాదని తేల్చడంతో లడ్డూ కల్తీ నిర్ధారణ అయినట్లు తేలిపోయింది. దీంతో గతంలో ఇదే అంశంపై గట్టిగా తన వాణి వినిపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అంతే కాదు తన పాత డిమాండ్ ను మరోసారి తెరపైకి తెచ్చారు.
తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారాన్ని సిట్ నిర్ధారించడంతో పవన్ కళ్యాణ్ ఇవాళ కీలక వ్యాఖ్యలతో ఓ ట్వీట్ చేశారు. ఇందులో
ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజానికి, తిరుమల తిరుపతి దేవస్థానం ఒక తీర్థయాత్ర కేంద్రం కంటే ఎక్కువన్నారు. ఇది ఒక పవిత్రమైన ఆధ్యాత్మిక నివాసమని, తిరుపతి లడ్డూ కేవలం తీపి కాదు, ఇది ఒక ఉమ్మడి భావోద్వేగమని తెలిపారు. తాము దానిని స్నేహితులు, కుటుంబ సభ్యులు, అపరిచితుల మధ్య సమానంగా పంపిణీ చేస్తామన్నారు. ఎందుకంటే ఇది మా సమిష్టి విశ్వాసం, లోతైన విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందన్నారు.

సగటున, ప్రతి సంవత్సరం దాదాపు 2.5 కోట్ల మంది భక్తులు తిరుమలను సందర్శిస్తారని, సనాతనుల భావాలు, ఆచారాలు ఎగతాళి చేయబడినప్పుడు లేదా అణగదొక్కబడినప్పుడు, అది కేవలం బాధ కలిగించేది కాదని, ఇది ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది విశ్వాసం మరియు భక్తిని విచ్ఛిన్నం చేస్తుందని పవన్ తెలిపారు. లౌకికత్వం రెండు వైపులా ఉండాలని, మన విశ్వాసం పట్ల రక్షణ, గౌరవం చర్చించలేనిదన్నారు.

మన సనాతన ధర్మం అత్యంత పురాతనమైన, నిరంతరం అభివృద్ధి చెందుతున్న నాగరికతలలో ఒకటి అన్నారు. అలాగే మనం భాగస్వాములతో చర్చించి సనాతన ధర్మ పరిరక్షణ బోర్డును స్థాపించాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. గతంలోనూ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలంటూ పెద్ద ఉద్యమమే చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందు ఈ డిమాండ్ పెట్టారు. అయితే ఆ తర్వాత మాత్రం అంతా సైలెంట్ అయిపోయారు. ఇప్పుడు సిట్ రిపోర్ట్ తో తేనెతుట్టె మళ్లీ కదిలింది.












Click it and Unblock the Notifications