Varahi Second Phase : వారాహి టూర్ రెండో దశపై పవన్ మంతనాలు-వచ్చే వారంలో మొదలు !
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విపక్షాల్ని ఏకం చేయడంతో పాటు ప్రభుత్వ విధానాలను తప్పుబడుతూ సాగేలా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేస్తున్న వారాహి విజయ యాత్ర తొలిదశ గోదావరి జిల్లాల్లో పూర్తయింది. నిన్న భీమవరం నియోజకవర్గంలో నిర్వహించిన సభతో పవన్ కళ్యాణ్ తొలిదశ వారాహి టూర్ ముగించారు. అనంతరం మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకుని నేతలతో ఇవాళ రెండోదశ యాత్రపై చర్చిస్తున్నారు.
గోదావరి జిలాల్లో చేపట్టిన వారాహి యాత్ర అన్నవరంలో ప్రారంభమై భీమవరంలో పూర్తయింది. ఈ మధ్య కాలంలో కాకినాడ, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాల్లో పవన్ యాత్ర సాగింది. ఇందులో వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసుకున్న పవన్.. పొత్తులపై మాత్రం అస్సలు మాట్లాడలేదు. ముఖ్యంగా తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని, ముఖ్యమంత్రిగా పనిచేసే అవకాశం ఇవ్వాలని ఓటర్లను పవన్ కోరారు. ఇంకా చెప్పాలంటే ఈసారి తనకే ఓటు వేయాలని పవన్ వేడుకున్నారు.

గతంలో ఎప్పుడో ఒకసారి నిర్వహించే బహిరంగసభల్లో పవన్ కళ్యాణ్ ఆవేశంగా ప్రసంగాలు చేసి వెళ్లిపోతారని, తిరిగి ఎప్పుడొస్తారో తెలియదన్న పేరుపడ్డారు. కానీ ఈసారి మాత్రం వారాహి టూర్ లో అలాంటి పరిస్దితులు లేకుండా పవన్ పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రసంగాల శైలిలోనూ మార్పులు చేసుకున్నారు. సీఎం జగన్ తో పాటు వైసీపీ ఎమ్మెల్యేలను టార్గెట్ చేసుకున్నా తీవ్ర విమర్శలకు దూరంగా ఉన్నారు. అలాగే జనసేన ప్రభుత్వం వస్తే ఏం చేస్తారో కూడా చెప్పుకోవడం మొదలుపెట్టారు.
దాదాపు నెలరోజుల పాటు సాగిన పవన్ వారాహి తొలిదశ టూర్ విజయవంతం అయిందని భావిస్తున్న జనసేన.. రెండోదశ టూర్ కు రంగం సిద్ధం చేస్తోంది. అయితే ఇది ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ ఉంటుంది, ఏయే తేదీల్లో ఉంటుందనే దానిపై పవన్ చర్చలు జరుపుతున్నారు. గోదావరి జిల్లాల్లో పర్యటిస్తున్న సమయంలోనే వచ్చే నెల మొదటివారంలో మరోసారి ఇక్కడికి వస్తానని పవన్ ప్రకటించారు. దీంతో గోదావరి జిల్లాల్లోని ఇతర ప్రాంతాల్లో రెండో దశ టూర్ మొదలుపెట్టి అక్కడి నుంచి పొరుగు జిల్లాల్లో పవన్ పర్యటన సాగే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications