మాట తప్పని జనసేనాని.. మళ్ళీ వారి కోసం పవన్ కళ్యాణ్ కోటి విరాళం!!
మాట తప్పని జనసేనాని ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. మళ్ళీ వారి కోసం పవన్ కళ్యాణ్ కోటి విరాళం ఇచ్చి వారికి భీమా కల్పించి అండగా నిలిచారు.
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తల సంక్షేమం కోసం, వారికి భరోసా కల్పించడం కోసం వారికి ఇన్సూరెన్స్ చేస్తున్న విషయం తెలిసిందే. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రస్తుతం ఏపీలో ఫిబ్రవరి 10వ తేదీ నుంచి ఫిబ్రవరి 28వ తేదీ వరకు కొనసాగుతున్న వేళ, జనసేనలో సభ్యులుగా నమోదు కావాలని పిలుపునిచ్చిన పవన్ కళ్యాణ్, జనసేన కార్యకర్తల భీమా కోసం కోటి రూపాయలు విరాళంగా ఇచ్చారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో కోటి రూపాయల చెక్ ని పిఎస్ చైర్మన్ నాదెండ్ల మనోహర్, కోశాధికారి ఎంవీ రత్నం లకు పవన్ కళ్యాణ్ అందజేశారు.
కోటి రూపాయల విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్
గత రెండు సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ ప్రతి సంవత్సరం కోటి రూపాయలు చొప్పున విరాళాన్ని అందించి పార్టీ క్రియాశీలక కార్యకర్తలకు ప్రమాద బీమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఈ సంవత్సరం కూడా కోటి రూపాయలు విరాళంగా ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఆపై జనసేన పార్టీ కీలక నాయకులతో మాట్లాడారు. జనసేన పిఎసి సభ్యులు, జిల్లాల అధ్యక్షులు, నియోజకవర్గాల ఇంచార్జ్ లు, పార్టీ నాయకులతో ఆయన టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏ విధంగా కొనసాగుతుంది అనేది సమీక్షించి, వారికి దిశ నిర్దేశం చేశారు.

సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చురుగ్గా ముందుకు తీసుకెళ్లాలన్న పవన్ కళ్యాణ్
క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్న పార్టీ వాలంటీర్లకు అభినందనలు తెలియజేశారు. అంతేకాదు ఈనెల 28వ తారీకు వరకు జరగనున్న సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత చురుగ్గా ముందుకు తీసుకువెళ్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జనసేన పార్టీ 150 మంది క్రియాశీలక సభ్యులతో ప్రారంభమైందని పేర్కొన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు లక్షల మంది క్రియాశీలక సభ్యులను పొందడం సంతోషంగా ఉందన్నారు.

కార్యకర్తల సంక్షేమానికి తన వంతు బాధ్యతగా జనసేనాని
ఇది కేవలం పార్టీ కోసం చేసే సభ్యత్వం కాదని, మీ వెంట నడిచే కార్యకర్తల కోసం, వారి కుటుంబాల కోసం ఒక ధీమా అందించే కార్యక్రమంగా నాయకులు గుర్తించాలని పవన్ కళ్యాణ్ తెలిపారు. జనసేన పార్టీని ముందుకు నడిపించడానికి పవన్ కళ్యాణ్ చాలా కష్టపడుతున్నారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వెనక్కి తగ్గకుండా పార్టీ కార్యక్రమాలను ఆయన నిర్వహిస్తున్నారు. కార్యకర్తల సంక్షేమానికి తన వంతు బాధ్యతగా ప్రతి సంవత్సరం ప్రమాద బీమా సౌకర్యాన్ని కల్పించడానికి కట్టవలసిన భీమా ప్రీమియంకు నగదును సమకూరుస్తున్నారు.

జనసేన కార్యకర్తలకు అందించే భీమాతో ప్రయోజనం ఇదే
ఈ సంవత్సరం కూడా మాట తప్పకుండా కోటి విరాళం అందించారు. ఇప్పటివరకు మూడేళ్ళుగా మూడు కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. పార్టీ కార్యకర్తలే తన బలమని, వారికి అండగా ఉండడం తన బాధ్యతని పవన్ కళ్యాణ్ పదేపదే చెబుతున్నారు. జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలకు పార్టీ భీమా సౌకర్యం ద్వారా ఐదు లక్షల వరకు ప్రమాద బీమా తోపాటు, ప్రమాదం జరిగినప్పుడు వైద్య ఖర్చులకు 50 వేల రూపాయల వరకు భీమా సదుపాయాన్ని అందిస్తున్నారు.












Click it and Unblock the Notifications