ఇరకాటంలో పవన్ - బీజేపీ తాజా వ్యూహం: చంద్రబాబు "సెట్" చేస్తారా..!?
పవన్ కల్యాణ్ ను ఇరకాటంలో పెట్టే వ్యూహాన్ని బీజేపీ అమలు చేస్తోంది. ఈ సమయంలో చంద్రబాబు నిర్ణయం కీలకం కానుంది.
ఏపీలో టీడీపీ-జనసేన పొత్తు ఖాయం. కానీ..అధికారికం కాలేదు. బీజేపీతో పొత్తులోనే ఉన్నామని పవన్ కామెంట్స్. ఉంటే జనసేనతో..లేకుంటే జనంతో పొత్తు అంటూ బీజేపీ నేతల వ్యాఖ్యలు. అసలు పవన్ కల్యాణ్ ప్రస్తుతం బీజేపీతో ఉన్నట్లా.. టీడీపీతో కలుస్తున్నట్లా. ఈ డైలమా కొనసాగుతున్న వేళ పవన్ ను ఫిక్స్ చేసేందుకు బీజేపీ సిద్దం అవుతోంది. కొత్త వ్యూహంతో ముందుకొస్తోంది. పవన్ ఇక తాను బీజేపీతోనా.. లేకపోతే టీడీపీతో కలుస్తారా అనేది స్పష్టం చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. మరి..పవన్ తేల్చి చెబుతారా..లేక చంద్రబాబు వ్యూహాత్మకంగా సెట్ చేస్తారా..ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చకు కారణమవుతోంది.

బీజేపీ వర్సస్ టీడీపీ...వైసీపీ వ్యతిరేక ఓటు
మరి కొద్ది రోజుల్లో ఉత్తరాంధ్రలో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ పదవీ కాలం మార్చి 29తో ముగియనుంది. ఈ లోగా ఎన్నికలు..కొత్త ఎమ్మెల్సీ ఎన్నిక జరగాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో వైసీపీ..టీడీపీ..బీజేపీ అభ్యర్ధులు పోటీ పడుతున్నారు. వైసీపీ అందరి కంటే ముందుగానే తమ అభ్యర్ధిని ఖరారు చేసింది. ఆ సమయంలోనే టీడీపీ తమ అభ్యర్ధిని ప్రకటించినా తాజాగా మార్పు చేసింది. బీజేపీ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ మాధవ్ తిరిగి పోటీ చేస్తున్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇప్పటికే మాధవ్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. ఇప్పుడు ఈ ఎన్నికలో బీజేపీ - టీడీపీ రెండు పార్టీలు బరిలో నిలిచాయి. మరి పవన్ ఎవరికి మద్దతిస్తారు. జనసేన మద్దతు దారులకు ఎవరు ఓటు వేయమని పిలుపునిస్తారు.

టీడీపీ- బీజేపీల్లో పవన్ మద్దతెవరికి
ఈ ఎన్నికలకు జనసేన నేరుగా పోటీ చేయపోయినా.. మిత్రపక్షంగా ఉన్న బీజేపీ.. కొత్తగా పొత్తు పెట్టుకోవటం ఖాయంగా కనిపిస్తున్న టీడీపీ బరిలో ఉన్నాయి. ఇక్కడా పవన్ పదే పదే చెప్పే వ్యతిరేక ఓటు చీలక వర్తిస్తుంది. వ్యతిరేక ఓటు చీలితే వైసీపీ అభ్యర్ధి గెలవటం సులువుగా మారుతుంది. టీడీపీ నుంచి తొలుత భీమిలి ప్రాంతానికి చెందిన మహిళా నేత గాడు చిన్ని లక్ష్మీ కుమారిని అభ్యర్ధిగా ప్రకటించారు. తాజాగా కాపు వర్గానికి చెందిన చిరంజీవిని బరిలో దించారు. ఈ ఎన్నికలో జనసేన మౌనంగా..తటస్థంగా ఉంటామని చెప్పే పరిస్థితి ఉండదు. అలా చెబితే బీజేపీతో పొత్తు లేదని భావించాలి. బీజేపీకి మద్దతు ఉంటే టీడీపీతో భవిష్యత్ సంబంధాలు ఏంటనే ప్రశ్న తలెత్తుతుంది. టీడీపీకి మద్దతు ఓపెన్ గా ఇవ్వటానికి పవన్ సిద్దంగా ఉన్నారా లేదా అనేది స్పష్టత రావాల్సి ఉంది.

పవన్ ను ఇరుకున పెట్టేలా బీజేపీ వ్యూహం
పవన్ కల్యాణ్ కొంత కాలంగా టీడీపీతో పొత్తు దిశగా అడుగులు వేస్తున్నారనేది బీజేపీకి తెలిసిన విషయమే. కానీ, పవన్ తాజాగా తాను బీజేపీతో పొత్తుతో ఉన్నామని చెప్పటం ద్వారా.. పవన్ తనంతటగా తానే టీడీపీతో పొత్తు విషయంలో తేల్చే వరకు వేచి చూడాలని బీజేపీ భావిస్తోంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ పవన్ మద్దతు కోరేందుకు బీజేపీ సిద్దం అవుతోంది. దీని ద్వారా వ్యూహాత్మకంగా పవన్ ను ఇరుకున పెట్టే ప్రయత్న చేస్తోంది. పవన్ బీజేపీకి మద్దతిస్తారా.. లేక టీడీపీ కోసం మౌనంగా ఉంటారా అనేది తెలుసుకోవటం కోసమే బీజేపీ కొత్త ఎత్తుగడ వేస్తోంది. ఈ సమయంలో చంద్రబాబు పాత్ర కీలకం కానుంది. టీడీపీతో అధికారికంగా పొత్తు ఖరారు కాకపోవటంతో..పవన్ బీజేపీతో కలిసినా అభ్యంతరం పెట్టే అవకాశాలు ఉండవని తెలుస్తోంది. అయితే, పవన్ అదే చేస్తే.. వైసీపీకి ఫలితం అనుకూలంగా మారే అవకాశం ఉంది. దీంతో.. పవన్ ఇప్పుడు ఏం చేయబోతున్నారు..ఏ పార్టీకి మద్దతుగా నిలుస్తారనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications