సరదా ఉంటే మీరు మూడు పెళ్లిళ్లు చేసుకోండి : పవన్ కళ్యాణ్..!!
తన పైన వైసీపీ నేతలు చేస్తున్న పెళ్లిళ్ల విమర్శల పైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. విశాఖ గర్జనలో పాల్గొన్న వైసీపీ నేతలు పవన్ కళ్యాణ్ విశాఖలో వివాహం చేసుకున్న అంశాన్ని ప్రస్తావించారు. విశాఖలో సినిమాలు - కలెక్షన్లు కావాలి రాజధానిగా విశాఖ వద్దా అని ప్రశ్నించారు. దీనికి పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. ఈ వాదనలో లాజిక్ లేదన్నారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని వైసీపీ నేతలకు ఈర్ష్యగా ఉందన్నారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నానని..మూడు రాజధానులు తీసుకొస్తున్నారా అని పవన్ ప్రశ్నించారు.
సరదా ఉంటే మీరు కూడా విడాకులు ఇచ్చి మూడు పెళ్లిళ్లు చేసుకోండి అంటూ సమాధానం ఇచ్చారు. తాను ముంబాయిలో కూడా నటన నేర్చుకున్నానని..మరి ముంబాయి కూడా రాజధానిగా ఆలోచిస్తారా అని ప్రశ్నించారు. 2014లో అమరావి రాజధానిగా మద్దతిచ్చిన సమయంలో..అప్పుడే విశాఖ లేదా కర్నూలు రాజధాని అని ఎందుకు చెప్పలేదని పవన్ నిలదీసారు. అప్పుడే చెప్పి ఉంటే తాము మద్దతుగా నిలిచేవాళ్లమని చెప్పుకొచ్చారు. విశాఖలో తాను విమానాశ్రయంలో దిగిన సమయం నుంచి పోలీసులు వ్యవహరించిన తీరు పైన ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. ప్రభుత్వంలో ఉన్న వారు గర్జనలు చేయటం ఏంటని పవన్ ప్రశ్నించారు.

కడుపు కాలిన వాడు గర్జిస్తాడు..కానీ, అమలు చేయాల్సిన వాళ్లు గర్జించటం ఏంటని నిలదీసారు. తాను విశాఖ చేరుకున్న తరువాత అంత మంది ర్యాలీకి వస్తారని ఊహించలేదన్నారు. ఒక ఐపీఎస్ అధికారి తనను ఒత్తిడి చేసి అభివాదాలు చేయవద్దని..సీట్లో కూర్చోవాలంటూ హుకుం జారీ చేసారని వివరించారు. తన చేతిని తడుతూ..రెచ్చగొట్టేలా వ్యవహరించారని పవన్ చెప్పుకొచ్చారు. అయితే, తాను పూర్తిగా సంయమనంతో వ్యవహరించానని వివరించారు. ర్యాలీలో పాల్గొన్నారనే కారణంతో వంది మందిని అరెస్ట్ చేసారన్నారు.
అర్ద్రరాత్రి హోటల్ వద్దకు వచ్చి తన కారు తాళాలు అడిగారని..వాళ్లకు ఏం అవసరమని ప్రశ్నించారు. వైసీపీ నేతలు 2019 ఎన్నికల సమయం నుంచి అనేక రకాలుగా తనను బెదిరించారని..వీటిని తాను భయపడేది లేదని పవన్ చెప్పుకొచ్చారు. అరెస్ట్ చేసిన తమ పార్టీ నేతలను విడుదల చేసే వరకూ జనవాణి కార్యక్రమం నిర్వహించమని పవన్ ప్రకటించారు. మరో వైపు పోలీసులు పవన్ కళ్యాణ్ తో చర్చలు చేస్తున్నారు. దీంతో..ఇప్పుడు విశాఖ కేంద్రంగా వపన్ కళ్యాణ్ తీసుకోబోయే నిర్ణయాల పైన ఉత్కంఠ నెలకొని ఉంది.












Click it and Unblock the Notifications