హోదాపై రాహుల్ సభ: జగన్ పొరపాటు, ఇరుకునపడేసిన పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనూహ్యంగా ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటేనే దూరంగా ఉండే పవన్.. ప్రత్యేక హోదా విషయంలో తన చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు.
అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనూహ్యంగా ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ అంటేనే దూరంగా ఉండే పవన్.. ప్రత్యేక హోదా విషయంలో తన చతురతను ప్రదర్శించారు.
గుంటూరులో ఏపీ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదాపై ఆదివారం సభ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సభకు పవన్ కళ్యాణ్, వైసిపి అధినేత జగన్‌లను కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించింది. ఇరువురు నేతలు హాజరు కాలేదు. కానీ పవన్ మద్దతు పలికారు.

కాంగ్రెస్‌లో పవనోత్సాహం
సమయాభావం వల్ల తాను రాలేకపోయానని, తాను అందుబాటులో లేనని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ప్రత్యేక హోదా కోసం ఎవరు ఉద్యమించినా మద్దతు పలుకుతానని స్పష్టం చేశారు. అలాగే ఇప్పుడు కాంగ్రెస్ సభకు మద్దతిస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు హోదా కోసం సభ నిర్వహిస్తున్న రఘువీరా రెడ్డిని అభినందించారు. పవన్ మద్దతు కాంగ్రెస్ పార్టీలో ఉత్సాహం నింపిందని చెప్పవచ్చు.

దటీజ్ పవన్ కళ్యాణ్
పవన్ కళ్యాణ్ నుంచి ఇది కొందరు ఊహించలేదు. అయితే ప్రత్యేక హోదాపై చిత్తశుద్ధితో ఉన్న ఆయన మద్దతిస్తారని చాలామంది భావించారు. పవన్‌కు మొదటి నుంచి కాంగ్రెస్ అంటే పడదు అనే అభిప్రాయం ఉంది. కానీ అన్నింటిని పక్కన పెట్టి హోదా కోసం ఎవరు ఉద్యమించినా మద్దతు పలుకుతానని చెప్పిన పవన్.. దానిని నిరూపించుకున్నారని అంటున్నారు.

విమర్శలకు తావిస్తున్న జగన్ తీరు
అదే సమయంలో వైసిపి అధినేత వైయస్ జగన్ తీరు విమర్శలకు తావిస్తోంది. హోదా కోసం ఉద్యమించే ఎవరితోనైనా తాను కలుస్తానని పవన్ స్పష్టంగా చెప్పారు. ఆ మేరకు నడుచుకుంటున్నారు. జగన్ మాత్రం ఇప్పటికీ డైలమాలో ఉన్నట్లుగా కనిపిస్తోంది. ప్రత్యేక హోదా కోసం ఎవరితోనైనా కలుస్తామని చెప్పడం వరకే తప్ప చేతల్లో కనిపించడం లేదంటున్నారు.

స్పందించని జగన్
గతంలో పవన్ కళ్యాణ్.. జగన్‌తో కలిసి పని చేసేందుకు కూడా సిద్ధమని ప్రకటించారు. అదే సమయంలో జగన్ మాత్రం పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేసేందుకు రాజకీయ కారణాలతో సుముఖత చూపినట్లుగా కనిపించలేదు. ఇప్పుడు హోదా కోసం కాంగ్రెస్ పార్టీ సభ నిర్వహిస్తే కనీసం జగన్ స్పందించక పోవడాన్ని ప్రశ్నిస్తున్నారు.

జగన్‌ను ఇరుకున పడేసిన పవన్
విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పు చేసిందని ఏపీలో ఇతర అన్ని పార్టీలు తప్పుబట్టాయి. 2014 ఎన్నికల్లో ప్రజలు అందుకే కాంగ్రెస్ పార్టీని తిప్పికొట్టారు. కానీ ఆ తర్వాత బిజెపి కూడా చేసిందేమీ లేదు. హోదా ఇస్తామని చెప్పి, మాట మార్చింది. ఇప్పుడు విభజన అంశాన్ని మరిచి హోదా కోసం ఉద్యమించాల్సిన సమయమని, దీని కోసం అందరూ ఏకతాటిపైకి రావాలని అంటున్నారు. ఇలాంటి సందర్భంలోను జగన్ కలిసి రాకపోవడం ఏమిటని అంటున్నారు. చివరి నిమిషంలో కాంగ్రెస్ సభకు మద్దతు పలకడం ద్వారా పవన్ కళ్యాణ్.. జగన్‌ను కూడా ఇరుకున పడేశారని అంటున్నారు. తద్వారా హోదా కోసం తాను ఎవరితోనైనా కలుస్తానని పవన్ చెప్పారు. జగన్ మాత్రం ముందుకు రాలేదు.












Click it and Unblock the Notifications