జగన్ రెడ్డి ఒప్పుకున్నాకే కదా..: ‘రాజధాని’పై ఏపీ సర్కారుకు పవన్ కళ్యాణ్ హెచ్చరిక
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ప్రాంత రైతులు వ్యక్తిని నమ్మి భూములు ఇవ్వలేదని, ప్రభుత్వాన్ని నమ్మి ఇచ్చారని అన్నారు. సోమవారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

జగన్ కూడా ఒప్పుకున్నాకే..
అమరావతి రాజధానిగా అన్ని పార్టీలు ఒప్పుకున్నాయని.. అందుకే ప్రజలు, రైతులు తమ భూములు ఇచ్చేందుకు ముందుకు వచ్చారని పవన్ కళ్యాణ్ చెప్పారు. గతంలో వైఎస్ జగన్ కూడా అమరావతిని రాజధానిగా ఒప్పుకున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారడం సరికాదని అన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసమే రైతులు భమూలు ఇచ్చారని చెప్పారు.

మూడు రాజధానులు ఎందుకు?
కొందరు రైతులు భూములు ఇచ్చేందుకు ఇష్టపడకపోవడంతో.. రైతుల కన్నీటితో ఏర్పడే రాజధాని వద్దని ఆనాడు తానే చెప్పానని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా ఒప్పుకుంది కాబట్టే ఆనాడు రైతులు తమ భూములు ఇచ్చారని అన్నారు. రాష్ట్రానికి మూడు రాజధానులు ఎందుకు? అని పవన్ ప్రశ్నించారు. పాలన ఒకే చోట ఉంచి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని అన్నారు.

ధైర్యముంటే ఇలా చేయండి?
ధైర్యముంటే ఏదో ఒక ప్రాంతంలోనే రాజధాని పెట్టాలని, దానిపై జగన్ రెడ్డి ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. పాలకులు చేసే తప్పులు ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతున్నాయన్నారు. కొద్ది మంది చేసిన పాలసీల వల్లే ప్రజలు కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. రాష్ట్రం విడిపోయినప్పటికీ.. విభజన తాలూకు జబ్బు ఇంకా మనల్ని పట్టిపీడుస్తోందని అన్నారు. ఇది భవిష్యత్ తరాల మీద ప్రభావం ఉంటుందని అన్నారు.

పవన్ కళ్యాణ్ హెచ్చరిక
వ్యక్తుల ఇష్టాఇష్టాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటే ఎంతో మంది ప్రజల జీవితాలు ఛిన్నాభిన్నమవుతాయని.. దీని గురించి ఆలోచించారా? అని ప్రశ్నించారు. కొందరు స్వార్థం కోసం విభజించుకుంటూ వెళుతున్నారని మండిపడ్డారు. దినదిన అభివృద్ధి చెందుతుందని ఆశించినవారిలో తాను ఒకడినని.. కానీ, ఇప్పుడు ఏపీ దిని దిన అధోగతి పాలవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అమరావతి రైతులకు న్యాయం చేయకుండా ముందుకెళితే తీవ్ర పరిణామాలుంటాయని జగన్ సర్కారును పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications