పొత్తులపై పవన్ కీలక వ్యాఖ్యలు-కుమారస్వామితో పోలిక-ముందస్తు వస్తే...
వైసీపీ నుంచి అధికారం తీసేసుకోవాలి, ప్రజలకు అప్పగించాలన్నదే తమ లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ వెల్లడించారు. వైసీపీకి వ్యతిరేకంగా ఉండే ఇతర పార్టీలను ఒప్పించి ఎన్నికల్లో కలిసి వెళ్తామని పవన్ తెలిపారు. తాము గతంలో కర్నాటకలో కుమారస్వామి తరహాలో 30-40 సీట్లు గెలిచి ఉంటే బావుండేదంటూ పవన్ వ్యాఖ్యానించారు. ముందస్తు ఎన్నికలు వస్తే జూన్ నుంచి క్షేత్రస్ధాయి పర్యటనలు చేస్తామన్నారు.

రాజకీయాల్లో అందరినీ కలుపుకుని వెళ్లాలనే తాను భావిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. కమ్యూనిస్టులతో ఉన్నప్పుడు బీజేపీ, బీజేపీతో ఉన్నప్పుడు కమ్యూనిస్టులు తనను తిట్టుకుంటున్నారని పవన్ పేర్కొన్నారు. కానీ తాను మాత్రం ప్రస్తుత పరిస్ధితుల్లో ఎన్నికల్లో ప్రభావం చూపించగలిగే పార్టీల్ని దృష్టిలో పెట్టుకునే విపక్షాల్ని ఏకం చేస్తానని చెప్పానన్నారు. పొత్తులు తప్పుకాదని, బీఆర్ఎస్ కూడా ఇప్పుడు పొత్తులతోనే బలపడిందని గుర్తుచేశారు.
వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనని తాను చెప్పడం వెనుక కూడా వైసీపీయే ఉందని తెలిపారు. తనను ఎవరూ ఏమీ అనకుండా ఉండాలంటే రాజకీయాల్లోకి రాకూడదన్నారు. తాను అజాత శత్రువుగా ఉండాలని కోరుకోవడం లేదన్నారు. తాను ఉనికి చాటుకోవడం కోసం పార్టీ పెట్టలేదన్నారు. రాజకీయ పార్టీ పెట్టామంటే అసెంబ్లీలో అడుగుపెట్టాలనే లక్ష్యంతోనే అన్నారు. నిర్మాణాత్మక రాజకీయాలనే తాను ఇష్టపడతానని పవన్ తెలిపారు. 2014లో లోతుగా చర్చించాకే టీడీపీ, బీజేపీలకు మద్దతిచ్చానన్నారు.
పొత్తుల విషయానికొస్తే వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని మరోసారి పవన్ స్పష్టం చేశారు. తమకు పట్టున్న ప్రాంతాల్లో 30 శాతం వరకూ ఓటు బ్యాంకు ఉందని, సగటున 7 శాతం ఓటు బ్యాంకు ఉండటం సాధారణమైన విషయం కాదన్నారు. తాను ముఖ్యమంత్రి కావడం గురించి ఆలోచించలేదని, పార్టీని ఏర్పాటు చేసి నిలబెట్టడంపైనే దృష్టిపెట్టామన్నారు. పొత్తులనేవి ఓ కులానికి సంబంధించినవి కావని రాష్ట్రానికి సంబంధించినవని, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించినవని పవన్ తెలిపారు. సీఎం అయ్యే పరిస్ధితి ఉంటేనే పొత్తు పెట్టుకోవాలని అనడం సరికాదన్నారు.
తాను పెద్దన్న పాత్ర వహించాలని చాలా మంది కోరుకుంటున్నారని, కానీ చేతిలో జేడీఎస్ కుమారస్వామిలా చేతిలో 30-40 సీట్లుంటే అప్పుడు డిమాండ్ చేసే పరిస్ధితి ఉంటుందన్నారు. ఒంటరిగా 137 స్ధానాల్లో పోటీ చేసే పరిస్ధితి చేస్తే 30-40 స్ధానాలు కూడా గెలిపించలేదని గుర్తుచేశారు. తమ గౌరవానికి భంగం కలుగకుండా ఉండే పరిస్దితి ఉండే పొత్తుతోనే ముందుకు వెళ్తానన్నారు. రాష్ట్రంలో జనసేనకు కచ్చితంగా ఓట్ల శాతం పెరిగిందన్నారు. సగటున 14-15 శాతం ఓటు బ్యాంకుకు వచ్చాం కాబట్టి రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా తదుపరి నిర్ణయాలు తీసుకుంటామన్నారు.
సీఎం పదవి అనేది తానే వరించాలి తప్ప వెంపర్లాడబోమన్నారు. తనను ముఖ్యమంత్రి చేయాలని టీడీపీ, బీజేపీ ఎందుకు కోరుకుంటాయని, తాను సత్తా చాటుకుని పదవి సాధించుకోవాలని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. వైసీపీ నుంచి అధికారం లాక్కోవడం, ప్రజలకు పంచడమే తమ లక్ష్యమన్నారు. ఇందుకోసం తాము ప్రయత్నాలు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు.
అకాల వర్షాలతో నష్టపోయిన గోదావరి జిల్లాల్లో పర్యటన అనుభవాల్ని ఇవాళ పవన్ మీడియాతో పంచుకున్నారు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతుల్ని పరామర్శించి ఆదుకోవాల్సిన ప్రభుత్వం, మంత్రులు అనుచిత వ్యాఖ్యలతో వారిని అవమానిస్తున్నారని పవన్ మండిపడ్డారు. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయకుండా రైతులు మాట్లాడితే కేసులు పెట్టిస్తూ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తోందని పవన్ ఆరోపించారు. వ్యవసాయం గురించి అవగాహన లేదని మాట్లాడుతున్న మంత్రులు, ప్రభుత్వం అవగాహన ఉండి ఏం చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు. అవగాహన ఉన్న వ్యక్తులు రైతుల్ని ఎందుకు ఏడిపిస్తున్నారని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications