బ్యాటరీ సైకిల్ తొక్కిన పవన్ కల్యాణ్.. యువకుడికి అదిరిపోయే గిఫ్ట్..
అతి తక్కువ ఖర్చుతో.. బ్యాటరీతో నడిచే సైకిల్ ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన రాజాపు సిద్ధూని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందించారు. ఇంటర్మీడియెట్ విద్యార్థి రూపొందించిన వినూత్న ఆవిష్కరణను పరిశీలించారు. ఆ యువకుడి ప్రతిభను మెచ్చుకున్నారు. ఈ మేరకు రూ. లక్ష ప్రోత్సాహకం అందజేసి ఆల్ ది బెస్ట్ చెప్పారు.
అతి తక్కువ ఖర్చుతో.. బ్యాటరీతో నడిచే సైకిల్ ను రూపొందించిన విజయనగరం జిల్లాకు చెందిన ఇంటర్మీడియెట్ విద్యార్ధి రాజాపు సిద్ధూని జనసేన అధినేత, రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. సిద్ధూ తయారు చేసిన వినూత్న ఆవిష్కరణను పరిశీలించారు. వినూత్న ఆలోచనతో సరికొత్త ఆవిష్కరణకు రూపం ఇచ్చిన సిద్ధూ గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుని అతన్ని మంగళగిరిలోని క్యాంపు కార్యాలయానికి పిలిపించుకున్నారు పవన్ కల్యాణ్.

సిద్ధూతో ప్రత్యేకంగా కొద్దిసేపు ముచ్చటించారు. అనంతరం యువకుడు ఆవిష్కరించిన సైకిల్ ను స్వయంగా నడిపారు. అతని ఆలోచనలు తెలుసుకుని అబ్బురపడ్డారు. సిద్ధూ రూపొందించిన గ్రాసరీ గురూ వాట్సప్ సర్వీస్ బ్రోచర్ చూసి ప్రత్యేకంగా అభినందించారు. అతని ఆలోచనలకు మరింత పదునుపెట్టాలని ఆకాంక్షిస్తూ రూ.లక్ష ప్రోత్సాహకం అందించారు. ఆ సైకిల్ పై సిద్ధూని కూర్చోబెట్టుకొని నడిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.

విజయనగరం జిల్లా, జాడవారి కొత్తవలస గ్రామానికి చెందిన సిద్ధూ సుదూరంలో ఉన్న కాలేజీకి వెళ్లేందుకు స్వయంగా ఒక ఎలక్ట్రిక్ సైకిల్ తయారు చేశాడు. మూడు గంటలు బ్యాటరీ ఛార్జ్ చేస్తే 80 కిలోమీటర్లు ప్రయాణించగల ఈ సైకిల్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.












Click it and Unblock the Notifications