మురళీ మోహన్ తట్టుకుంటారు, రైతులు ఎటు పోతారు: పవన్ కళ్యాణ్
హైదరాబాద్: ఎవరినీ ఇబ్బంది పెట్టే ఉద్దేశం తనకు లేదని, బాధ్యతను మాత్రమే తాను గుర్తు చేశానని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వ్యక్తిగతంగా ఎవరి మీద కూడా తనకు వ్యతిరేకత లేదని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి భూసేకరణపై ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో సుదీర్ఘంగా మాట్లాడారు. విధాన నిర్ణయంలో తప్పొప్పుల గురించి మాత్రమే తాను మాట్లాడుతున్నానని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ సమయంలో పెద్ద మనుషుల ఒప్పందాన్ని ఉల్లంఘించడం వల్లనే తర్వాతి తరాలపై తీవ్ర ప్రభావం పడిందని ఆయన అన్నారు.
విధివిధానాలు సరిగా చేయకపోతే దాని ప్రభావం భవిష్యత్తు తరాలపై పడుతుందని ఆయన అన్నారు. కొత్త రాజధానికి రైతుల ఏడుపు తగలకూడదని ఆయన అన్నారు. 33 వేల ఎకరాలను రైతులు స్వచ్ఛందంగా ఇచ్చి ఉంటారు, కాదనడం లేదు గానీ 33 వేల ఎకరాలను ఎన్ని దశల్లో అభివృద్ధి చేస్తారని ఆయన అడిగారు. ఒకేసారి 33 వేల ఎకరాల్లో వ్యవసాయం చేయకూడదంటే రైతులూ వ్యవసాయ కూలీలు ఎటు పోతారని ఆయన అడిగారు.

హైదరాబాద్ రింగ్ రోడ్డు నిర్మాణంలో మురళీ మోహన్ భూమి పోయిందని, అలా భూమి పోతే తాను గానీ మురళీ మోహన్ గానీ తట్టుకోగలరని, కానీ భూమి మీదనే ఆధారపడిన రైతులు ఎటు పోతారని ఆయన అన్నారు. మూడు పంటలు పండే భూములను ఇవ్వలేమని పెనుమాక రైతులు అంటున్నారని ఆయన అన్నారు.ఎపి రాజధాని భూసేకరణ విషయంలో పది శాతం మంది రైతులు వ్యతిరేకత చూపుతున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులే చెబుతున్నారని ఆయన అన్నారు. రాజధాని ప్రాంతం నుంచి ఉండవల్లి, పెనుమాక, బేతంపూడి గ్రామాలను తప్పించాలని ఆయన సూచించారు. లేదంటే రైతులను సంతోషపెట్టే విధంగా భూసమీకరణ చేయాలని ఆయన అన్నారు. రాజధాని నిర్మాణాన్ని ఎన్ని దశల్లో పూర్తి చేస్తారో చెప్పాలని ఆయన అన్నారు. రాజధాని ప్రాంతాల్లో ఒకేసారి వ్యవసాయాన్ని ఆపేయాలని ఆదేశించడం మాని దశలవారీగా చేసుకుంటూ పోతే రైతులకు నష్టం తగ్గుతుందని ఆయన అన్నారు. ఒకేసారి వ్యవసాయం చేయవద్దంటే రైతులు ఎటు పోవాలని ఆయన అడిగారు.
రైతులు మాత్రమే కాకుండా వ్యవసాయంపై ఆధారపడిన రైతు కూలీలు ఎటు పోవాలని ఆయన అడిగారు. తెలంగాణకు చెందిన ఏడు మండలాలను పోలవరం ప్రాజెక్టు కోసం ఎపిలో కలిపేశారని, ఆ సమస్యలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతులకు నిజాయితీగా రుణ మాఫీ చేయాలని అనుకున్నారని, నిధుల కొరత వల్ల జాప్యం జరిగిందని, దాన్ని తాను అర్థం చేసుకుంటానని ఆయన అన్నారు.
సింగపూర్ కన్నా పెద్దగా ఎపి రాజధానిని ఏర్పాటు చేస్తే మంచిదేనని, అయితే దాన్ని ఎన్ని దశల్లో పూర్తి చేస్తారని ఆయన అన్నారు. రాజధాని నిర్మాణం కోసం 33 వేల ఎకరాలను ఎన్ని దశల్లో అభివృద్ధి చేస్తారని ఆయన అన్నారు. 33 వేల ఎకరాల భూములను ఇచ్చిన రైతులకు ఏ విధమైన రక్షణ కల్పిస్తారని ఆయన అడిగారు. రాజధాని నిర్మాణానికి కనీసం 20, 25 ఏళ్లు పడుతుందని, ప్రభుత్వాలు మారితే రైతుల పరిస్థితి ఏమిటని ఆయన అన్నారు. పార్టీ రహితంగా విధానాలు మారినా ఆ రైతులకు రాజ్యాంగపరంగా ఎలాంటి రక్షణ కల్పిస్తారని ఆయన అడిగారు.
తాను దిగజారుడు రాజకీయాలు చేయబోనని, కానీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నప్పుడు మాట్లాడాల్సిన బాధ్యత తనపై ఉందని, ప్రజలు పిలిస్తేనే తాను రాజధాని ప్రాంతాల్లో పర్యటించానని ఆయన అన్నారు. తెలంగాణకు పెద్ద మనుషుల ఒప్పందాన్ని అమలు చేయకపోవడం వల్ల రాష్ట్ర విభజన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందని, దానివల్ల తర్వాతి తరాలు ఇబ్బంది పడ్డాయని ఆయన అన్నారు. ఇప్పుడు చేసే నిర్ణయాలకు భవిష్యత్తు తరాలు ఇబ్బంది పడకూదని ఆయన అన్నారు. తప్పొప్పులను చూపించే బాధ్యత తనపై ఉందని ఆయన అన్నారు.
రాష్ట్రాన్ని సరైన పద్ధతిలో విభజించలేదని, సరైన విధివిధానాల మీద కార్యాచరణలు జరగకపోతే దాని ప్రభావం భవిష్యత్తు తరాలపై పడుతుందని ఆయన అన్నారు. ఇప్పుడు సరిగా ఆలోచించలేకపోతే భవిష్యత్తు తరాలు నష్టపోకూడదని ఆయన అన్నారు. భూసేకరణ విషయంలో ఎవరినీ ఇబ్బంది పెట్టదలుచుకోలేదని, బాధ్యతను మాత్రమే గుర్తు చేశానని ఆయన అన్నారు. తమకు ఇచ్చిన ప్యాకేజీ సరిపోదని ఉండవల్లి గ్రామ రైతులు చెబుతున్నారని, మూడు పంటలు పండే భూములను ఇవ్వబోమని పెనుమాక రైతులు అంటున్నారని ఆయన అన్నారు. భూములు ఇవ్వని రైతులకు నచ్చజెప్పి భూములు తీసుకుంటే అభ్యంతరం లేదని, అయితే రైతు కూలీలను ఏ విధంగా ఆదుకుంటారని ఆయన అన్నారు.
తాను గాలిలో మాట్లాడడం లేదని ఆయన అన్నారు. పెద్ద మనుషుల ఒప్పందాన్ని అమలు చేయకపోవడం సామాజిక అశాంతి నెలకొందన ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అటువంటిదే జరిగితే రాష్ట్రం విడిపోక పోవచ్చు గానీ సామాజిక అశాంతి నెలకొంటుందని ఆయన అన్నారు. జనసేనను స్థాపించినప్పుడు తాను అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీని కలిశానని, రాష్ట్ర విభజన వల్ల ఇరువైపులా తీవ్రమైన నష్టం జరిగిందని చెప్పానని ఆయన అన్నారు. రాజధాని మనదని హైదరాబాదుకు సీమాంధ్ర నుంచి ప్రజలు వచ్చారని, దాని వల్ల తమకు అన్యాయం జరిగిందని ఇక్కడి వారు అన్నారని ఆయన గుర్తు చేశారు. ముఖ్యమంత్రులు ఎవరు వచ్చినా తమకు అన్యాయం జరిగిందని తెలంగాణ ప్రజలు అన్నారని ఆయన గుర్తు చేశారు.
తాను ఏ పదవీ ఆశించలేదని, సామాన్యుడిగా తాను విసిగిపోయానని, ప్రజల మధ్య చిచ్చు పెట్టవద్దని చెప్పానని, ప్రశాంత వాతావరణం కలిగించాలని మోడీని కోరానని, అందుకు మోడీ అంగీకరించారని, దాని తర్వాతనే తాను బిజెపిని బలపరిచానని ఆయన అన్నారు. తాను కూడా రైతునని, కూరగాయలు పండిస్తానని, రైతుల కష్టాలు తెలుసునని ఆయన అన్నారు. గాంధీ గ్రామస్వరాజ్యం కావాలని అన్నారని, గాంధీ మాటల ప్రేరణతో తాను పనిచేస్తున్నాని, గ్రామాలను చంపకూడదని, వాటిని అభివృద్ధి చేయాలని ఆయన అన్నారు.
రాజధాని కోసం ప్రభుత్వం 33 వేల ఎకరాలు సేకరించాలని తలపెట్టిందని, స్వచ్ఛందంగా రైతులు భూములు ఇస్తున్నారంటే తాను సంతోషించానని ఆయన అన్నారు. భూసేకరణ వల్ల ఐదు శాతం మంది రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వం ప్యాకేజీ బాగానే ఉందని, అయితే వాటిని అమలు చేస్తారనే గ్యారంటీ ఏమిటని ఆయన అన్నారు. అంత భూమిని సేకరించినప్పుడు ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఆయన అన్నారు. టిడిపిని ఇరకాటంలో పెట్టాలని తాను దిగదిడుపు రాజకీయాలు చేయడం లేదని, ప్యాకేజీ రైతులకు సంతృప్తికరంగా ఉండాలని, ప్యాకేజీ అమలుకు గ్యారంటీ ఉండాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications