Pawan Kalyan : ఏపీ గవర్నర్ తో పవన్ కళ్యాణ్ భేటీ-తాజా పరిస్ధితిపై గంటపాటు చర్చలు..
ఏపీలో గవర్నర్ గా నియమితులైన అబ్దుల్ నజీర్ తో పవన్ కళ్యాణ్ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
ఏపీలో కొత్తగా గవర్నర్ గా నియమితులైన మాజీ జస్టిస్ అబ్దుల్ నజీర్ వరుసగా నేతలకు, అధికారులకు అపాయింట్ మెంట్లు ఇస్తున్నారు. ఇదే క్రమంలో ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో భేటీ అయ్యారు. విజయవాడ రాజ్ భవన్ కు వచ్చిన పవన్ కళ్యాణ్ ఆయనతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
మచిలీపట్నంలో రేపు జనసేన పదో ఆవిర్భావ దినోత్సవ సభ కోసం విజయవాడ చేరుకున్న పవన్ కళ్యాణ్.. ఒక్కరోజు ముందుగా గవర్నర్ నజీర్ తో భేటీ అయ్యారు. దాదాపు గంటసేపు వీరిద్దరూ పలు విషయాలపై చర్చించారు. తాజా రాజకీయ పరిణామాలతో పాటు ప్రస్తుత రాజకీయాలపై వీరిద్దరి మధ్య చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. గత గవర్నర్ హరిచందన్ తో ఎక్కువగా కలవని పవన్.. కొత్త గవర్నర్ తో అందరి కంటే ముందుగా భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

గవర్నర్ తో పవన్ కళ్యాణ్ భేటీ అనంతరం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ఇందులో ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్ గారితో ఈ రోజు సాయంత్రం జరిగిన మర్యాదపూర్వక భేటీ ఎంతో విలువైనదని పవన్ పేర్కొన్నారు. వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి, రాజ్యాంగ నిపుణులైన శ్రీ అబ్దుల్ నజీర్ గారి అనుభవం, మార్గదర్శకత్వం కచ్చితంగా రాష్ట్ర ప్రజలకు మేలు చేస్తుందని విశ్వసిస్తున్నానంటూ పవన్ ముగించారు.












Click it and Unblock the Notifications