పిఠాపురంలో సంక్రాంతి సంబరాలలో పాల్గొననున్న పవన్ కళ్యాణ్.. వారికి నగదు, ఉత్తర్వులు!
సంక్రాంతి సంబరాలు అనగానే ముందు మనకు గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఏపీలో సంక్రాంతి సంబరాలు చాలా స్పెషల్. రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలు సంతోషంగా జీవించాలని జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. ముత్యాల ముగ్గులతో, ముంగిట గొబ్బెమ్మలతో, హరిదాసుల పాటలు, బసవన్నల ఆటలు, కోడి పందాలు, నోరూరించే పిండివంటలు పండుగ అంటే ఇలా ఉండాలి అనేలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత ఘనంగా సంక్రాంతి పండుగ జరుగుతుంది.
పిఠాపురంలో సంక్రాంతి వేడుకలు
దేశ విదేశాలలో ఎక్కడెక్కడో సెటిలైన వారంతా పండుగకు తమ సొంత ఊరికి వచ్చి తమ వాళ్ళందరిని కలుసుకొని సంతోషంగా సంబరాలు జరుపుకుంటారు. అటువంటి సంక్రాంతి పండుగకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధమవుతోంది. ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో కూడా సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

మూడురోజుల సంక్రాంతి సంబరాలు.. పాల్గొననున్న పవన్ కళ్యాణ్
ఈనెల 10వ తేదీన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిఠాపురం సంక్రాంతి వేడుకలలో పాల్గొంటారు. పిఠాపురంలో ఈ నెల 9, 10, 11వ తేదీలలో సంక్రాంతి సంబరాలను నిర్వహించనున్నారు. జాయింట్ కలెక్టర్, పోలీస్, ఇతర శాఖల అధికారులు ఈ సంబరాల ఏర్పాట్లపైన సమీక్షను నిర్వహించారు. సంక్రాంతి శోభను, తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడేలా, జిల్లా పర్యాటక అభివృద్ధికి దోహదం చేసేలా కార్యక్రమాలను చేపట్టాలని అధికారులు ఈ సమీక్ష సమావేశంలో నిర్ణయించారు.
ఆర్టిస్ట్ ల కోసం ప్రభుత్వం డబ్బులు ఇస్తూ ఉత్తర్వులు
అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని జేసి సూచించారు. సంక్రాంతి సంబరాలను నిర్వహించే ప్రాంతాలను సందర్శించారు సభ, సాంస్కృతిక ప్రదర్శనలు వేదికలు, ఎగ్జిబిషన్ స్టాల్స్ ఏర్పాటు వంటి అంశాల పైన అధికారులు ఫోకస్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే పిఠాపురంలో సంక్రాంతి సంబరాలను నిర్వహించడానికి ఆటపాట నిర్వహించడానికి ఆర్టిస్టుల కోసం నాలుగు లక్షల 80 వేల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
కళాకారుల పారితోషకం, రవాణా చార్జీల కోసం నగదు
ఆర్టిస్టుల రెమ్యూనరేషన్, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులకు రూ.4.80 లక్షలు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజర్ జైన్ విడుదల చేశారు. సంక్రాంతి సంబరాలలో పాల్గొనే కళాకారులకు పారితోషకం కింద, రవాణా చార్జీల కింద ఈ నగదును చెల్లిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications