పవన్ పార్టీ మట్టి కొట్టేదే, చిరు అలా అన్నారు: ఈటెల
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ జనసేనపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్ స్పందించారు. పవన్ కళ్యాణ్ పార్టీ తెలంగాణ ప్రజల కళ్లలో మట్టికొడుతుందని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
తెలంగాణ వస్తుందని అనుకుంటే తాను సామాజిక తెలంగాణ అని ఉండేవాడిని కాదని కాంగ్రెసు నేత, కేంద్ర మంత్రి, పవన్ కళ్యాణ్ అన్నయ్య చిరంజీవి అన్నారని ఆయన గుర్తు చేశారు. 2009లో తెలంగాణ ఉద్యమానికి గండి కొట్టింది చిరంజీవి ప్రజారాజ్యం పార్టీయేనని ఆయన అన్నారు. తెలంగాణలో పొత్తులుంటాయనే ఆందోళన వద్దని ఆయన అన్నారు.

కాంగ్రెసు తెలంగాణ నేతల తీరుపై తెరాస శాసనసభ్యుడు కెటి రామారావు తీవ్రంగా విరుచుకు పడ్డారు. ఇద్దరు పార్లమెంటు సభ్యులు మాత్రమే ఉన్నారని తమ పార్టీని అవమానించినవారికి ఇప్పుడు రెండు సీట్లు కూడా రావని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. ఎవరి వల్ల తెలంగాణ వచ్చిందో ఎన్నికల్లో తేల్చుకుందామని ఆయన సవాల్ చేశారు.
తెలంగాణ ఇస్తామని 2004లో మాట ఇచ్చిన కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ ఇప్పటి దాకా ఎందుకు ఆగారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారులపై కేసుల పెట్టించినవారు తెలంగాణ తెచ్చామంటే జనం నమ్ముతారా అని ఆయన అడిగారు.












Click it and Unblock the Notifications