అనంతలో పవన్ కరువుయాత్ర!: జనసేనాని కోసం రూట్ మ్యాప్ సిద్దమవుతోంది..

Subscribe to Oneindia Telugu

అనంతపురం: వచ్చే ఎన్నికల్లో అనంతపురం నుంచి బరిలో దిగుతున్నట్లు స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్.. త్వరలో ఆ జిల్లాలో కరువు యాత్ర చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు జనసేనకు సంబంధించిన పలువురు పరిశీలకులు రూట్ మ్యాప్ సిద్దం చేసే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం.

జనసేన పార్టీ స్థాపించి మూడేళ్లు పూర్తయినా ఇప్పటికీ దాని బలోపేతంపై పవన్ కళ్యాణ్ అంతగా ఫోకస్ చేయలేదు. అయితే ఇటీవలే పోటీపై స్పష్టతనిచ్చిన ఆయన.. అనంత కరువుయాత్రతో పార్టీ కార్యాచరణ షురూ చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. పార్టీ పట్ల యువతను పెద్ద ఎత్తున ఆకర్షించడంతో పాటు, వచ్చే ఎన్నికల నాటికి అనంతపురంలో తనకంటూ భారీ ప్రజా మద్దతును కూడగట్టుకోవాలనే యోచనలో పవన్ కరువు యాత్రకు శ్రీకారం చుట్టారు.

Pawan kalyan plans for karuvu yatra in anantapuram

కాగా, పార్టీ తొలి కార్యాలయాన్ని కూడా అనంతపురంలోనే ఏర్పాటు చేస్తామని పవన్ కళ్యాణ్ ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏళ్లుగా కరువు కోరల్లో అల్లాడుతున్న అనంతపురం దుస్థితిపై సమగ్ర అధ్యయనం చేస్తానని.. ఇటీవలి పార్టీ వార్షికోత్సవ సభలో పవన్ ప్రకటించారు. ఇందుకు అనుగుణంగానే ఇప్పుడు జిల్లాలో కరువుయాత్ర మొదలుపెట్టనున్నారు.

పవన్ కరువుయాత్ర ఏర్పాట్ల కోసం జనసేన మద్దతుదారులు కొంతమంది ఇప్పటికే అనంతపురంలో దిగినట్లు తెలుస్తోంది. కళ్యాణ దుర్గం-అనంతపురం రూట్ మ్యాప్ ను వారు సిద్దం చేస్తున్నట్లు చెబుతున్నారు. కళ్యాణదుర్గం మీదుగా మడకశిర, పెనుగొండ.. ఆపై గోరంట్ల నుంచి పుట్టపర్తి, అనంతపురం వరకు ఈ యాత్ర జరగనున్నట్లు సమాచారం. రైతు సమస్యలతో పాటు కరువు యాత్రలో తన దృష్టికి వచ్చే సమస్యలను పవన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

ఏదేమైనా 2019 ఎన్నికల నాటికి ప్రజల్లో తన పట్ల ఓ స్థిరాభిప్రాయం ఏర్పరచడం కోసం పవన్ రంగం సిద్దం చేసుకుంటున్నారు. పవన్ పట్ల ప్రజలు సానుకూలంగా స్పందిస్తే.. వచ్చే ఎన్నికల్లో ఓట్లు చీలిపోవడం ఖాయం. మరి ఇది ఏ పార్టీకి లాభిస్తుంది? ఏ పార్టీకి నష్టం చేకూరుస్తుందనేది వేచి చూడాలి.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Janasena President Pawan Kalyan planning for Karuvu Yatra in Anantapuram district. Some of the Janasena supporters are making the arrangements for this
Please Wait while comments are loading...