మీకు ఉలికిపాటు దేనికి? చంద్రబాబు పర్యటన అడ్డగింతపై ప్రశ్నించిన పవన్ కళ్యాణ్!!
చంద్రబాబు పర్యటనను అడ్డగించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపిస్తే ఉలికిపాటు దేనికి అంటూ ప్రశ్నించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఇప్పుడే యుద్ధం వాతావరణం కనిపిస్తుంది. ఎన్నికల వేడి అప్పుడే ఏపీలో మొదలైంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి వద్ద టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన పోలీసులు అడ్డగించడాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. శుక్రవారం రాత్రి భారీ నిరసన దీక్ష కూడా చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు టిడిపి నాయకులు. ఇదిలా ఉంటే చంద్రబాబు పర్యటనను అడ్డగించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించారు.

ప్రతిపక్షాలను నిలువరించటమే పరిపాలన అనుకుంటున్న సీఎం
రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపిస్తే ఉలికిపాటు దేనికి అంటూ ప్రశ్నించారు. వైసిపి ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం, వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేఛ్చ లాంటి మాటలకు అర్దం తెలియదని, రాజ్యాంగ విలువలపై ఈ పాలకులకు ఏమాత్రం గౌరవం కనిపించడం లేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రజా పక్షం వహిస్తూ మాట్లాడే ప్రతిపక్షాలను నిలువరించడమే పరిపాలన అని వైసిపి ముఖ్యమంత్రి భావిస్తున్నారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటనను అడ్డుకున్న విధానం ప్రభుత్వ నిరంకుశ పోకడలకు అద్దం పడుతుందని పవన్ కళ్యాణ్ అసహనం వ్యక్తం చేశారు.

పోలీసులపై పాలకుల ఒత్తిడి.. అందుకే ఇలా బాబు పర్యటన అడ్డగింత
ప్రజా జీవితంలో ఉన్న నాయకుడిగా పర్యటనకు వెళ్లిన చంద్రబాబును అడ్డుకోవడానికి పోలీసులను రోడ్డుకు అడ్డంగా కూర్చోబెట్టడం ఏమిటి అంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. ఎక్కడైనా ప్రజలు తమ నిరసనను తెలియజేయడం కోసం రోడ్డుపై బైఠాయించడం చూశాం కానీ, విధి నిర్వహణలో ఉన్న పోలీసులు రోడ్డుకి అడ్డంగా కూర్చోవడం వైసిపి పాలనలోనే చూస్తున్నామని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. పోలీసులు ముందు సభకు అనుమతి ఇచ్చారని, ఆపై మళ్ళీ ఈ విధంగా ప్రవర్తించారని, సభకు అనుమతి ఇచ్చిన పోలీసులే ఈ విధంగా చేయడం వెనుక వారిపై పాలకుల ఒత్తిడి ఎంతగా ఉందో అర్థమవుతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు.

తన పర్యటనలను అడ్డుకున్న అనేక ఘటనలను గుర్తు చేసిన పవన్ కళ్యాణ్
అనపర్తిలో పోలీసుల ద్వారా చేయిస్తున్న చర్యలు అప్రజాస్వామికంగా ఉన్నాయని పేర్కొన్న పవన్ కళ్యాణ్ గతంలో తనను కూడా అడ్డుకున్న అనేక ఘటనలను ప్రస్తావించారు. గతంలో తాను జనవాణి కార్యక్రమం కోసం విశాఖపట్నం వెళితే విధి దీపాలు ఆర్పి వేసి, హోటల్ గదిలో ఏ విధంగా బంధించారో ప్రజలు చూశారన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటంలో అక్రమ కూల్చివేతలను పరిశీలించి బాధితులను పరామర్శించేందుకు వెళుతుంటే తనను అడ్డుకున్నారని గుర్తు చేశారు. నడుస్తుంటే నడవకూడదని కూడా ఆంక్షలు పెట్టారని నాటి ఘటనలను చెప్పుకొచ్చారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లను సహించలేని స్థితికి వైసిపి పాలకులు
రాష్ట్రంలో ప్రతిపక్షం గొంతు వినిపిస్తుంటే ప్రభుత్వం ఎందుకు ఉలిక్కిపడుతోంది తెలియడం లేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్లను సహించలేని స్థితికి వైసిపి పాలకులు చేరారని అర్థమవుతుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజల కష్టాల గురించి మాట్లాడుతుంటే వైసిపి పాలకులకు జీర్ణం కావడం లేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటాయని ఈ పాలకులు తెలుసుకోవాలంటూ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.












Click it and Unblock the Notifications