బాలినేని కోసం పవన్ కీలక సిఫార్సు - చంద్రబాబుకు సంకటం..!!
ఏపీ రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కూటమి నేతలు వైసీపీ లక్ష్యంగా అడుగులు వేస్తున్నాయి. వైసీపీకి చెందిన పలువురు సీనియర్లు కూటమి పార్టీల్లో చేరుతున్నారు. జగన్ బంధువు బాలినేని జనసేనలో చేరిన తరువాత దక్కే పదవి పైన చర్చ మొదలైంది. ఒంగోలు లో బాలినేనికి ప్రాధాన్యతను టీడీపీ నేతలు వ్యతిరేకిస్తున్నారు. ఇదే సమయంలో బాలినేని కోసం పవన్ కీలక సిఫార్సు చేసినట్లు సమాచారం. ఇందుకు చంద్రబాబు అంగీకరిస్తార.. ఏం జరుగుతోంది..
మారుతున్న లెక్కలు
ఒంగోలు రాజకీయంలో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ ఆవిర్భావం నుంచి ఒంగోలుతో పాటుగా ప్రకాశం జిల్లాలో అన్నీ తానై వ్యవహరించిన బాలినేని ప్రస్తుతం జనసేన లో ఉన్నారు. ఎన్నికల ముందే ఆయన చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఆ సమయం లోనే టీడీపీకి రావాలని..అధికారంలోకి వచ్చిన తరువాత తగిన ప్రాధాన్యత ఉంటుందని హామీ ఇచ్చారు. కానీ,బాలినేని వైసీపీ నుంచే పోటీ చేసారు. ఎన్నికల సమయంలో ఒంగోలు ఎంపీతో పాటుగా దర్శి ఎమ్మెల్యే విషయంతో తాను సూచించిన వారికి సీట్లు ఇవ్వాలని పట్టు బట్టారు. కానీ, జగన్ అంగీకరించ లేదు. ఎన్నికల్లో ఓటమి తరువాత ఈవీఎం ల పైన బాలినేని కోర్టుకు ఎక్కారు. పార్టీ నుంచి మద్దతు లభించ లేదు. తరువాతి పరిణామాల్లో బాలినేని జనసేనలో చేరారు.

బాలినేనికి పదవి
పవన్ తో సత్సంబంధాలు ఉన్న బాలినేని జనసేనలో చేరే సమయంలోనూ రాజకీయ భవిష్యత్ పైన హామీ పొందారు. ఎమ్మెల్సీ పదవితో పాటుగా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చారని సమాచారం. అయితే, బాలినేని జనసేనలో ఎంట్రీ సమయం నుంచి ఒంగోలు టీడీపీ నేతలు ఓపెన్ గానే కామెంట్స్ చేస్తున్నారు. బాలినేని జనసేన లో చేరినా.. అధికారంలో ఉన్న సమయంలో చేసిన పనులకు సమాధానం ఇవ్వకుండా వదిలేది లేదని హెచ్చరిస్తున్నారు. జనసేన లోని కొందరు నేతలు సైతం బాలినేనికి దూరంగా ఉంటున్నారు. ఈ సమయంలోనే సెకీ ఒప్పందాల పైన నాటి విద్యుత్ శాఖ మంత్రిగా జగన్ నిర్ణయాల పైన బాలినేని వరుసగా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. జగన్ ను ఇరకాటంలోకి నెట్టే విధంగా వ్యవహరిస్తున్నారు.
పవన్ సిఫార్సు
జగన్ తో బంధుత్వంతో పాటుగా వైసీపీ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన బాలినేనికి కూటమి ప్రభుత్వంలో మంత్రి పదవి ఇవ్వాలనేది పవన్ ఆలోచనగా తెలుస్తోంది. ప్రభుత్వంలో జనసేన నుంచి పవన్ తో సహా మరో ఇద్దరు మంత్రులుగా ఉన్నారు. అందులో ఇద్దరు కాపు, ఒక కమ్మ వర్గానికి చెందిన వారు ఉండటంతో రెడ్డి సామాజిక వర్గం నుంచి తమ పార్టీ నుంచి బాలినేనికి ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశం నుంచి ఇద్దరు మంత్రులు ఉన్నారు. పవన్ సిఫార్సు చేసినా..చంద్రబాబు ఇందుకు సమ్మతిస్తారా అనేది సందేహంగానే కనిపిస్తోంది. ఒంగోలు టీడీపీ నేతలు బాలినేనితో కలిసి పని చేసే పరిస్థితులు ప్రస్తుతానికి కనిపించటం లేదు. అయితే పవన్ పట్టు బడితే చంద్రబాబు అంగీకరిస్తారని జనసేనలో చర్చ జరుగుతోంది. ముందుగా ఎమ్మెల్సీ...ఆ తరువాత మంత్రి పదవి ఇవ్వటం ఖాయమని జనసేన నేతల అంతర్గత చర్చల్లో చెబుతున్నారు.

అదే జరిగితే ప్రకాశం జిల్లాలో మళ్లీ బాలినేని తన హవా కొనసాగించే అవకాశం ఉంది. అయితే ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, బాలినేని మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే రీతిలో వివాదాలు ఉండగా, బాలినేని ఎమ్మెల్సీ పదవిని స్వీకరిస్తే అక్కడ ఒక్క ఒరలో ఏ మేరకు రెండు కత్తులు ఇమడుతాయో వేచి చూడాలి. కాగా ఎమ్మెల్సీ పదవి దక్కిన వెంటనే పవన్ తో ఒంగోలు లో భారీ బహిరంగ సభను కూడా బాలినేని ఏర్పాటు చేసే అవకాశం ఉందని కూడా ప్రచారం ప్రకాశంలో జోరందుకుంది.
ఏదిఏమైనా బాలినేనికి ఎమ్మెల్సీ పదవి దక్కితే మాత్రం, ప్రకాశంలో జనసేనకు మరింత బలం చేకూరి క్యాడర్ బలోపేతం అవుతుందని బాలినేని అభిమానులు తెలుపుతున్నారు. మరి ఇంతకు బాలినేని కి ఎమ్మెల్సీ పదవి దక్కుతుందా? లేదా అన్నది త్వరలోనే బహిర్గతమయ్యే రాజకీయ స్థితిగతులు ఉన్నట్లు పొలిటికల్ టాక్.












Click it and Unblock the Notifications