పవన్‌తో భర్తీ, జూ ఎన్టీఆర్ రానట్లేనా? ఫ్యాన్స్ అసహనం
హైదరాబాద్: గత ఎన్నికల్లో టిడిపి తరఫున సందడి చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సినిమాలకే పరిమితం అయ్యారు. ఎన్నికల హడావుడి తారాస్థాయికి చేరినా అతడు టిడిపి ప్రచారం వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎన్నికల గురించి ఎక్కడా మాట్లాడినట్లు కూడా లేదు. ఎన్టీఆర్ స్థాపించిన టిడిపి తరఫున 2009 ఎన్నికల్లో ఎన్టీఆర్ విస్తృత ప్రచారం చేశారు. ఇప్పుడు ఆయన దూరంగా ఉండటం ఇటు టిడిపి, అటు జూనియర్ అభిమానులకు అర్థం కావడం లేదు.
టిడిపికి ప్రచారం విషయమై జూ ఎన్టీఆర్ స్థానాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఆ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు భర్తీ చేశారంటున్నారు. 2009లో టిడిపి తరఫున జూనియర్ స్టార్ కంపెయినర్‌గా దూసుకెళ్లారు. తన వాళ్లకు టిక్కెట్లు ఇప్పించుకున్నారు. నాడు ఆయనను తన నియోజకవర్గానికి పంపించాల్సిందిగా టిడిపి అభ్యర్థులు కోరుకున్నారు.

కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తెలుగు తమ్ముళ్లు కనీసం జూనియర్ ఎన్టీఆర్ వైపుకు చూడటం లేదంటున్నారు. టిడిపి వారసుడు నారా లోకేష్ అని దాదాపు తేలిపోయింది. ఈ నేపథ్యంలో జూనియర్ వైపు చూసేందుకు తెలుగు తమ్ముళ్లు సాహసించడం లేదట. తాత స్థాపించిన పార్టీకి ప్రచారం చేస్తానని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటి వరకు బయటకు రాలేదు.
మరోవైపు పార్టీ తరఫున ప్రచారం చేయాలని తాము ఎవరినీ అడగటం లేదని, వాళ్లంతట వాళ్లే రావాలని నారా లోకేష్ రెండు రోజుల క్రితం స్పష్టం చేశారు. దీంతో జూనియర్ ప్రచారానికి వచ్చే అవకాశాలు లేవని చెబుతున్నారు. జూనియర్‌ను పక్కన పెట్టడాన్ని ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారట. అయితే, పవన్‌తో కొంత ఆ లోటును పూడ్చుకునే ప్రయత్నాలు టిడిపి చేస్తోంది. టిడిపి తరఫున ఆయన ప్రచారం చేయనున్నారు.












Click it and Unblock the Notifications