ఆ ఆఫీసుకో దండం-తిరిగిచ్చేసిన పవన్-చంద్రబాబుకు లేఖ..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. విజయవాడలో ప్రభుత్వం తనకు కేటాయించిన క్యాంప్ ఆఫీసును తిరిగి ఇచ్చేశారు. ఈ మేరకు ఇవాళ సీఎం చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. తనకు మరో క్యాంపు కార్యాలయం ఉన్నందున దీన్ని తిరిగి ఇచ్చేస్తున్నట్లు ఇందులో తెలిపారు. విజయవాడ నగరంలో ఇంత విశాలమైన క్యాంపు కార్యాలయం తనకు కేటాయించినందుకు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు.
కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టగానే పవన్ కళ్యాణ్ కు విజయవాడలోని జలవనరులశాఖకు చెందిన గవర్నర్ పేట క్యాంపు కార్యాలయాన్ని కేటాయించారు. అయితే మొదట్లో ఇక్కడకు వచ్చిన పవన్.. ఆ తర్వాత మాత్రం క్రమంగా దూరమయ్యారు. ప్రస్తుతం మంగళగిరిలోని తన నివాసంలోనే ఎక్కువగా ఉంటున్న పవన్ కళ్యాణ్.. విజయవాడ క్యాంపు కార్యాలయాన్ని వదిలేయాలనే నిర్ణయానికి వచ్చారు. ఈ మేరకు చంద్రబాబుకు లేఖ రాశారు. ఫర్నిచర్ తో సహా భవనం వెనక్కి ఇచ్చేస్తున్నట్లు పవన్ అందులో తెలిపారు.

వాస్తవానికి ఈ క్యాంపు కార్యాలయానికి నెగెటివ్ సెంటిమెంట్ ఉంది. ఇందులో గతంలో ఉన్న మంత్రులంతా ఆ తర్వాత ఎన్నికల్లో ఓటమి పాలై పదవులు కోల్పోయారు. వీరిలో కొందరు రాజకీయంగా అప్రాధాన్యంగా మారిపోయారు కూడా. వీరిలో టీడీపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, వైసీపీ మంత్రులు బొత్స సత్యనారాయణ, అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. వీరంతా తమ హయాంలో ఈ ఆఫీసునే నివాసంగా మార్చుకుని ఉన్నారు. కానీ ఆ తర్వాత రాజకీయంగా దెబ్బతిన్నారు. దీంతో వాస్తుపరంగా మంత్రులకు బెజవాడ క్యాంపు కార్యాలయం కలిసి రాదనే ప్రచారం ఉంది.












Click it and Unblock the Notifications