చంద్రబాబు అరెస్టుపై టాలీవుడ్ మౌనం అందుకే ? కారణం చెప్పేసిన పవన్ కళ్యాణ్ !
ఏపీలో స్కిల్ స్కాం కేసులో నెల క్రితం టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని వైసీపీ ప్రభుత్వం అరెస్టు చేసింది. కర్నూల్లో అరెస్టు చేసి విజయవాడకు తీసుకొచ్చిన సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి రాజమండ్రి జైలుకు రిమాండ్ పై పంపారు. అప్పటి నుంచి చంద్రబాబు జైల్లోనే ఉన్నారు. దీనిపై టీడీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపడుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో జైలుకు వెళ్లిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంఘీభావం ప్రకటించి వచ్చారు. అంతటితో ఆగకుండా టీడీపీ-జనసేన పొత్తుపైనా ప్రకటన చేశారు.
అయితే చంద్రబాబు అధికారంలో ఉండగా ఆయన చుట్టూ తిరిగిన టాలీవుడ్ పెద్దలు, ప్రముఖులు మాత్రం ఈ అరెస్టుపై స్పందించేందుకు ఇష్టపడటం లేదు. ముఖ్యంగా గతంలో చంద్రబాబుతో పలు ప్రయోజనాలు పొందిన వారు కూడా మౌనంగా ఉండిపోతున్నారు. కేవలం గతంలో టీడీపీలో పనిచేసిన మాజీ ఎంపీ మురళీమోహన్, అశ్వనీదత్ వంటి వారు, దర్శకుడు రవిబాబు వంటి వారు స్పందించారు. దీంతో టాలీవుడ్ పెద్దలంతా ఎందుకిలా మౌనంగా ఉండిపోతున్నారన్న ప్రశ్నలు ఉదయించాయి.

అయితే వైఎస్ జగన్ భయంతోనే చంద్రబాబు అరెస్టుపై స్పందించేందుకు టాలీవుడ్ పెద్దలు ముందుకు రావడం లేదనే చర్చ జరుగుతోంది. అయితే పవన్ కళ్యాణ్ తాజాగా దీనిపై స్పందిస్తూ టాలీవుడ్ ఎందుకు మౌనంగా ఉండిపోతోందన్న అంశంపై తన అభిప్రాయం వెల్లడించారు. గతంలో చంద్రబాబుకు మద్దతుగా రజనీకాంత్ వ్యాఖ్యలు చేసినప్పుడు వైసీపీ నేతలు ఆయన్ను ఎలా టార్గెట్ చేశారన్నది గుర్తుచేసిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు కూడా టాలీవుడ్ లో ఎవరైనా స్పందిస్తే అలాగే టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు.
మరోవైపు టాలీవుడ్ సహజ వైఖరిపై పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినిమా పరిశ్రమ చాలా బలహీనమైందని పవన్ తెలిపారు. అక్కడ కూడా రాజకీయంగా ఎప్పటినుంచో వేర్వేరు అభిప్రాయాలు ఉన్నాయన్నారు. ఎవరికి వారు రాజకీయంగా పలు పార్టీలకు మద్దతుగా ఉండేవారన్నారు. ఎన్టీఆర్ వంటి వారు సీఎంగా ఉండగానే ఆయనపై ఎన్నో సినిమాలు తీసిన విషయాన్ని గుర్తుచేశారు. కానీ ఎన్టీఆర్ వారిని టార్గెట్ చేయలేదన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్ధితి లేదని, అందుకే తాను టాలీవుడ్ స్పందించాలని కోరుకోవడం లేదన్నారు.












Click it and Unblock the Notifications