దక్షిణాది టూర్ అందుకేనన్న పవన్-తిరుమల లడ్డూపై కీలక వ్యాఖ్యలు..!
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దక్షిణ భారత ఆలయాల యాత్ర ఇవాళ ప్రారంభమైంది. హైదరాబాద్ నుంచి ఉదయం కేరళలోని కొచ్చికి వెళ్లిన పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ఆలయాల సందర్శనకు బయలుదేరి వెళ్లారు. కుమారుడు అకీరా నందన్ తో కలిసి పవన్ ఈ టూర్ లో పాల్గొంటున్నారు.దక్షిణ భారతదేశ ఆలయాల యాత్రకు శ్రీకారం చుట్టిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు కేరళలోని చొట్టనిక్కరలో ఉన్న శ్రీ ఆగస్త్య మహర్షి ఆలయం, అగస్త్య ఆశ్రమం సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తన దక్షిణ భారత ఆలయాల సందర్శన ఉద్దేశంతో పాటు తిరుమల లడ్డూపై కీలక వ్యాఖ్యలు చేశారు.
తిరుమల లడ్డూపై పవన్
తిరుమల బాలాజీకి దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారని పవన్ తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తులు ఎంతో నమ్మకంగా, ఆధ్యాత్మిక చింతనతో వస్తుంటారని, అలా వచ్చే వారి మనోభావాలు గాయపడకూడదనేది తన ఆవేదన అన్నారు. తిరుమల లడ్డులో కల్తీ జరగడం నిజంగా దురదృష్టకరమని పవన్ తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ భవిష్యత్తులో జరగకూడదు అన్నదే తన బలమైన ఆకాంక్ష అన్నారు.

సీబీఐ అరెస్టుల్ని స్వాగతించిన పవన్
తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు కల్తీ వ్యవహారంపై ఏర్పాటు అయిన ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ వ్యవహారంలో పాత్ర ఉన్న వాళ్ళని అరెస్టు చేయడం కేసు దర్యాప్తులో భాగమని, సంతోషించదగిన విషయమని పవన్ తెలిపారు. భవిష్యత్తులో కూడా తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో జాగ్రత్తలు పాటించాలన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదాల్లో కానీ, ఇతర వ్యవహారాల్లో తగు జాగ్రత్తలు పాటించాలన్నారు.

దక్షిణాది పర్యటన వ్యక్తిగతమే
దక్షిణాది రాష్ట్రాల ఆలయాల సందర్శన అనేది పూర్తిగా తన వ్యక్తిగత అంశమని పవన్ తెలిపారు. రాజకీయాలకు దీనికి సంబంధం లేదన్నారు. సుమారు నాలుగున్నర సంవత్సరాల క్రితం చెల్లించుకోవలసిన మొక్కుల కోసం తన ఆరోగ్యం సైతం అంతగా సహకరించకున్నా రావాల్సి వచ్చిందన్నారు. కేరళతో పాటు తమిళనాడులో ఉన్న ఆలయాలను దర్శించుకుంటున్నట్లు తెలిపారు. ఎర్ర చందనాన్ని అక్రమ రవాణా చేస్తున్నప్పుడు పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారని, ఎర్రచందనం అమ్మకం విషయంలో దేశం మొత్తానికి నూతన విధానం తీసుకురావాలని కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.












Click it and Unblock the Notifications