ఓకేనా చెప్పండి!: పవన్ కళ్యాణ్ 'జనసేన' పత్రికా ప్రకటన
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ శుక్రవారం ఓ పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఎన్నికల కమిషన్ వద్ద జనసేన పార్టీ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నామని, దీని పైన ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని ఆ పత్రికా ప్రకటనలో జనసేన కోరింది.
కేంద్ర ఎన్నికల సంఘం వద్ద పార్టీని నమోదు చేయించుకుంటే బహిరంగ ప్రకటన ఇవ్వాల్సి ఉంటుంది. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ పత్రికా ప్రకటన విడుదల చేసింది. జనసేన పార్టీని ఈసీ వద్ద రిజిస్టర్ చేస్తున్నామని, అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరింది.

కాగా, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు పవన్ కళ్యాన్ జనసేన పార్టీని స్థాపించి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. పార్టీని స్థాపించిన ఆయన ఎన్నికలలో పోటీ చేస్తారని అందరూ భావించారు.
అనూహ్యంగా ఆయన భారతీయ జనతా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి మద్దతిచ్చారు. పోటీ నుండి తప్పుకున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఆయన విస్తృతంగా పర్యటించి.. బీజేపీ, టీడీపీల తరఫున ప్రచారం చేశారు. ఆయన ప్రచారం చేసిన పార్టీలు కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాయి.
ఇదిలా ఉండగా.. ఇప్పుడు పవన్ కళ్యాన్ పార్టీ పైన దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఈసీ వద్ద ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. ఆయన ఇప్పుడు బహిరంగ ప్రకటన విడుదల చేశారు. రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలలో పార్టీ పోటీ చేసే అవకాశాలున్నాయి.












Click it and Unblock the Notifications